మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుండి అలుపనేదే లేకుండా కష్టపడుతున్నారు. రీఎంట్రీ తర్వాత ‘ఖైదీ నెం 150,సైరా’ సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను చేస్తున్నారు. అది పూర్తయ్యాక ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ చేయనున్నారు. ఒక సినిమాను సక్రమంగా రూపొందించడం ఎంత ముఖ్యమో అంతే బాగా జనాల్లోకి తీసుకెళ్లడం ముఖ్యం. మంచి పబ్లిసిటీ ఉన్నపుడే సినిమాకు రీచ్ బాగుంటుంది. ఈ సంగతి చిరుకు బాగా తెలుసు.
అందుకే తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో ముందుంటున్నారు. అంతేకాదు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నప్పుడు తనను తాను ప్రమోట్ చేసుకుంటూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. మెగాస్టార్ స్థాయికి ఈ ప్రమోషన్లు అవసరమా అంటే కాదని చెప్పలేం. అసలే కరోనాతో ఇండస్ట్రీ దెబ్బతింది. ఓటీటీల హవా పెరిగిపోయింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం హీరోల ముందున్న ప్రథమ కర్తవ్యం. అందుకే చిరు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘సామ్ జామ్’ అనే ఓటీటీ షోకు హాజరయ్యారు. ఇటీవలే బిగ్ బాస్ యాజమాన్యం ఫైనల్ ఎపిసోడ్ రోజున ట్రోఫీ ప్రధానానికి ఆహ్వానించగానే ఓకే అన్నారు. ఇవన్నీ చిరును నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మన స్టార్ హీరోల్లో ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో ఉంటున్న పేరు చిరుదే.