అల్లరి నరేష్ చిత్రానికి 11 సెట్ లా..!

అల్లరి నరేష్ చిత్రానికి 11 సెట్ లా..!

Published on Aug 1, 2012 4:43 PM IST


తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో సోసియో ఫాంటసీ చిత్రాలు వచ్చి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సోసియో ఫాంటసీ చిత్రాల్లో ఎక్కువ భాగం యమలోకం మీదే రావడం విశేషం. యమలోకం నేపధ్యంలో వచ్చిన ‘యమ గోల’, ‘యముడికి మొగుడు’, ‘యమలీల’, ‘యమజాతకుడు’, ‘యమగోల మళ్ళీ మొదలైంది’, ‘యమ దొంగ’ మొదలైన చిత్రాలు అప్పట్లో బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేసి మంచి విజయాల్ని అందుకున్నాయి. ఈ సినిమాలన్నింటిని మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలతో పూర్తి కమర్షియల్ విలువలతో తెరకెక్కించారు. కానీ ఇప్పుడు వాటికి భిన్నంగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా యమలోకం కాన్సెప్ట్ తో పూర్తి హాస్యభరితమైన ఒక చిత్రం తెరకెక్కుతోంది. అల్లరి నరేష్ తో ‘నేను’ మరియు ‘అత్తిలి సత్తిబాబు’ లాంటి చిత్రాలు తీసిన ఇ. సత్తిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

‘ఈ చిత్రంలో యమలోకానికి సంభందించి మొత్తం 11 సెట్స్ వేశాము. ఇంతకముందు వచ్చిన సినిమాల్లో ఇన్ని సెట్స్ వేయలేదు. ఆగష్టు 10 నుంచి 25 వరకు పాలకొల్లులో ఒక షెడ్యూల్ జరగనుంది. ఆ షెడ్యూల్తో మూడు పాటల మినహా మిగిలిన చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. ఆ తర్వాత పాటలను చిత్రీకరించనున్నామని’ ఈ చిత్ర నిర్మాత అడ్డాల చంటి తెలియజేశారు. ఈ చిత్రంలో నరేష్ సరసన రిచా పనాయ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో యముడు పాత్రలో షాయాజీ షిండే కనిపించనున్నారు మరియు ప్రముఖ నటి రమ్యకృష్ణ యమధర్మరాజు భార్యగా కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ పూర్తి వినోదాత్మక చిత్రానికి కోటి సంగీతం అందిస్తున్నారు. మన మాస్ హీరోలే యముడిని ఇబ్బంది పెట్టి అంత కామెడీ చేస్తే, మరి మన కామెడీ హీరో అల్లరి నరేష్ యముడిని ముప్పుతిప్పలు పెట్టడంలో ఏ రేంజ్ కామెడీ చేసుంటారో అనే దానికోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు