ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలు విడుదలవడం మాములుగా జరిగేదే కానీ ఈ 2013 సంక్రానితికి టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలు బాక్స్ ఆఫీసు వద్ద తలపడనున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరికొత్త లుక్ తో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాద్షా’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నామని ఇటీవలే ఈ చిత్ర బృందం తెలిపారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు వి.వి వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ఇద్దరు హీరోలూ ఇప్పటివరకూ పనిచేయని క్రేజీ డైరెక్టర్స్ తో చేస్తుండడం వల్ల ఈ రెండు చిత్రాల పై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాల్లోనూ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్రాలు కాకుండా నాగార్జున – దశరథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లవ్ స్టొరీ’ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్.టి ఆర్ ‘అదుర్స్’ చిత్రంతో మొదటి సంక్రాంతి విజయాన్ని అందుకున్నారు. రామ్ చరణ్ మాత్రం ఇప్పటివరకూ సంక్రాంతి విజయాన్ని అందుకోలేదు. మామూలుగా మంచి ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీసు వద్ద తలపడతారా లేక థియేటర్లు మరియు ఒక దాని వల్ల ఒక దానికి కలెక్షన్లు తగ్గుతాయనే ఉద్దేశంతో విడుదల తేదీ మారుస్తారా అనే దాని కోసం మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.