ఓటిటి సమీక్ష: ‘కురుక్షేత్ర’ (9 ఎపిసోడ్స్) – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో

Kurukshetra Netflix Series

విడుదల తేదీ : అక్టోబర్ 10, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

ప్రసార వేదిక: నెట్ ఫ్లిక్స్
నటీనటులు: యానిమేటెడ్ పాత్రలు
దర్శకత్వం: ఉజాన్ గంగూలీ
నిర్మాతలు: అలోక్ జైన్, అను సిక్కా, అజిత్ అంధరే
సంగీతం: సిమాబ్ సేన్
యానిమేషన్ స్టూడియో: హై-టెక్ యానిమేషన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రీసెంట్ గా యానిమేషన్ పరంగా వచ్చి సెన్సేషన్ ని సెట్ చేసిన మహావతార్ నరసింహ కోవలోనే ఓటిటిలో వచ్చిన సరికొత్త యానిమేటెడ్ పీరియాడిక్ సిరీస్ నే “కురుక్షేత్ర”. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ పాన్ ఇండియా భాషల్లో తీసుకొచ్చిన ఈ సిరీస్ (మొత్తం 18 ఎపిసోడ్స్ లో 9 ప్రస్తుతం స్ట్రీమింగ్ కి వచ్చాయి) ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇది పూర్తి మహాభారతం కాదు కేవలం పాండవులు, కౌరవుల నడుమ జరిగిన మహా సంగ్రామం కురుక్షేత్రం వరకు మాత్రమే కనిపిస్తుంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన పాండవులు తమ వనవాసం అనంతరం కౌరవుల నుంచి తమకి రావాల్సిన హక్కులు తమ భూమి, రాజ్యం వంటివి రానందున ఇరు పక్షాల నడుమ కురుక్షేత్రం అనివార్యం అవుతుంది. పాండవులు యుద్ధం పట్ల ఆసక్తి చూపకపోయినప్పటికీ కురు మహారాజు దుర్యోధనుడు మాత్రం కయ్యానికి కాలు దువ్వడానికే సిద్ధంగా ఉంటాడు. ఇలా పాండవుల చెంత శ్రీకృష్ణుడు, కౌరవుల చెంత వృద్ధ మహాయోధులు అయినటువంటి భీష్ముడు, దృతరాష్ట్రుడు ఇతర దిగ్గజాలు తమకి వ్యూహకర్తలుగా ఉంటారు. ఇలా మొదలైన 18 రోజుల కురుక్షేత్ర మహా సంగ్రామం ఎలా జరిగింది? ఇందులో ధర్మం, కర్మం వెనుక ఉన్న ఆంతర్యాలు ఏంటి? ఎవరి కర్మ వారిని ఎలా భాద్యులని చేసింది? కృష్ణుడు హితబోధ, తాను చూపిన ధర్మ మార్గాలు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ ని తప్పక చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఖచ్చితంగా ఇండియన్ వెబ్ సిరీస్ హిస్టరీలో ముఖ్యంగా యానిమేటెడ్ పరంగా ఇలాంటి ప్రయత్నాన్ని తీసుకొచ్చిన మేకర్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఒక అద్భుతమైన అంశాన్ని తీసుకొని దానిని అంతకుమించిన రీతిలో ప్రెజెంట్ చేయడం అనేది మంచి విషయం. చాలా మందికి చాలా తక్కువే మహాభారతం కోసం అందులోని కురుక్షేత్ర మహా సంగ్రామం కోసం అవగాహన ఉండి ఉంటుంది.

పలు చిత్రాల్లో కూడా చాలా తక్కువే చూపించారు ఏమో అన్నట్టుగా కూడా ఈ సిరీస్ చూస్తే అనిపిస్తుంది. ఆ రీతిలో ఈ సిరీస్ కథనాన్ని దర్శకుడు చాలా డీటెయిల్డ్ గా తీసుకెళ్లడం జరిగింది. మొత్తం 18 రోజుల మహా సంగ్రామం తాలూకా ఔన్నత్యం ఈ 18 రోజుల్లో ఒకో ముఖ్య పాత్ర తాలూకా ఆవశ్యకతని చూపించిన విధానం అమితంగా ఆకట్టుకుంటుంది. చాలా తక్కువ నిడివితోనే ఈ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేయడం మంచి విషయం అయితే రెండో ఎపిసోడ్ నుంచే సాలిడ్ ట్రీట్మెంట్ మొదలవుతుంది.

భీష్మ మహాముని ఎపిసోడ్ మొదలు కొని అర్జునుడు, అభిమన్యుడు, ద్రోణాచార్యుడు, జయద్రరుడు, ఘటోత్కచుడు ఎపిసోడ్స్ వీక్షకులని ఒక మర్చిపోలేని ఫీల్ ని కలిగిస్తాయి. ఇందులో గొప్ప విషయం ఏంటంటే చాలా మందికి మహాభారతం అనేది కేవలం ఒక యుద్ధంగా మాత్రమే తెలుసు. కానీ అసలు ఆ రణభూమిలో ఏం జరిగింది? రెండు కుటుంబాలు నడుమ భేదాభిప్రాయాలు, యుద్ధం ఏర్పడడానికి మారిన పరిస్థితులు దర్శకుడు కళ్ళకి కట్టినట్టు చూపించాడు. నిజంగానే ఇలా జరిగి ఉంటుందా అనే అనుభూతి ఈ సిరీస్ చూస్తే తప్పక అనిపించి తీరుతుంది.

ఇదే సమయంలో ఈ సిరీస్ నే ఇలా ఉంటే ఒక రాజమౌళి లాంటి దర్శకుడో మొన్న వచ్చిన వచ్చిన కల్కి సినిమాలో దృశ్యాలు గుర్తుకు వచ్చినప్పుడో నిజంగా మనుషులుతో తెరకెక్కించి ఉంటే ఇంకెంత బాగుంటుందో అనే అనుభూతి కలుగుతుంది. అంత ప్రభావం ఈ సిరీస్ లో కనిపిస్తుంది. అంతే కాకుండా పవర్ఫుల్ పాత్ర శ్రీకృష్ణుడు, అర్జునుడి నడుమ సన్నివేశాలు, శ్రీకృష్ణుడుపై అన్ని సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అవుతాయి.

అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన హితబోధ, కేశవుని విశ్వరూపం విజువల్స్ ఈ సిరీస్ కి మరో బలమైన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇలా ఒకో ఎపిసోడ్ ని ప్రెజెంట్ చేసిన విధానం అందులోని ఎమోషన్స్ ముఖ్యంగా ఆ యాక్షన్ బ్లాక్ లు అయితే అదిరాయి అనిపిస్తుంది. యోధులు బాణాలు ఎక్కుపెట్టినపుడు వచ్చే ఎఫెక్ట్స్ కానీ యుద్ధభూమిలో కౌరవులు పన్నే పన్నాగాలు వ్యూహాలు సాలిడ్ గా అనిపిస్తాయి.

ఇలా అర్జునుడు ఎపిసోడ్ వరకు మంచి ఎంగేజింగ్ గానే సిరీస్ వెళుతుంది. కానీ అప్పుడు వస్తుంది అసలు సిసలు ఎపిసోడ్ ఘటోత్కచుడుపై ఈ ఒక్క ఎపిసోడ్ ని మాత్రం మంచి మాస్ ఆడియెన్స్ కోసం అన్నట్టు సిద్ధం చేసినట్టు ఉంటుంది. ప్యాకెడ్ మాస్ మూమెంట్స్ మరియు యాక్షన్ తో ఈ ఎపిసోడ్ ని నింపేసి సాలిడ్ ట్రీట్ ని అయితే అందిస్తారు. డెఫినెట్ గా మిగతా అన్ని ఎపిసోడ్స్ ని మించి ఇది ఎక్కువశాతం వీక్షకులని ఎంగేజ్ చేస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో ఎంగేజ్ చేసే అంశాలే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మధ్యలో అక్కడక్కడా కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. అలాగే చాలామందికి తెలియని పాత్రలు కూడా కనిపిస్తాయి కాబట్టి వారికి ఇందులో ఇమిడేందుకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా టెక్నికల్ గా ఈ సిరీస్ ని బాగానే ప్లాన్ చేసినప్పటికీ యానిమేషన్ మాత్రం కొంతమేర మరీ అంత నాచురల్ గా కనిపించదు.

స్క్రీన్ పై కనిపించే సన్నివేశాలు అక్కడక్కడా ఏదో ఆయిల్ పెయింటింగ్ లా కనిపిస్తూ ఉంటాయి మరికొన్ని చోట్ల అయితే 2డి యానిమేషన్ బొమ్మలు చూస్తున్నట్టే అనిపిస్తుంది. సో కంప్లీట్ యానిమేషన్ లవర్స్ మంచి అంచనాలు దీనిపై పెట్టుకుంటే మాత్రం ఈ అంశంలో నిరాశ చెందే అవకాశం ఉంది. ఇంకా కథనంలోకి వెళుతున్న కొద్దీ కొన్ని పాత్రలు తాలూకా బ్యాక్ స్టోరీలు రిపీట్ కావడం తప్పనిసరి కానీ ఇవి అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పలేం.

అలాగే ఎపిసోడ్స్ కి సాలిడ్ నేపథ్య గీతం కూడా కొంచెం మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ పై అబ్బురపరిచే యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నప్పుడు అదే రీతిలో మరింత ఎగ్జైటింగ్ స్కోర్ కూడా ఉండి ఉంటే చూస్తున్నపుడు మరింత ఎఫెక్టీవ్ గా ఉంటుంది కానీ ఇది కొంచెం ఈ వెబ్ సిరీస్ లో మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. అలాగని సంగీతం బాలేదని కాదు ఇంకా బెటర్ గా ప్లాన్ చేయాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ తాలూకా నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. ఎంత ఖర్చు చేసారో కానీ ఈ యానిమేషన్ సిరీస్ కోసం ప్రతీ ఒక్క టీం పెట్టిన ఎఫర్ట్స్ ఖచ్చితంగా వృథా పోలేదు. యాక్షన్ పార్ట్ డిజైన్ చేయడం నుంచి కానీ ఆయా పాత్రల డిజైన్ సృష్టించిన ప్రపంచం, కథనం తీసుకెళ్లిన తీరు మెప్పిస్తాయి. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

ఇక దర్శకుడు ఉజాన్ గంగూలీ విషయానికి వస్తే.. తాను ఈ వెబ్ సిరీస్ కి సాలిడ్ వర్క్ అందించారు అని చెప్పవచ్చు. తన క్లారిటీ మేకింగ్ ఇందులో మెప్పిస్తుంది. నిజానికి ఈ 9 ఎపిసోడ్స్ లోనే కురుక్షేత్ర యుద్ధాన్ని 14 రోజుల వరకు చూపించేసారు. అయినప్పటికీ మిగతా 9 ఎపిసోడ్స్ కి కావాల్సిన ఎగ్జైట్మెంట్ అలానే ఉంచే ప్రయత్నం చేశారు. ఈ సిరీస్ కోసం తన గ్రౌండ్ వర్క్ బాగా చేసినట్టు అనిపిస్తుంది. ఇదే సిరీస్ ని యానిమేటడ్ గా కాకుండా నిజంగా సినిమాలా తెరకెక్కించి ఉంటే మరింత అద్భుతంగా ఉంటుంది అనే రీతి ఎక్స్ పీరియన్స్ ని తాను అందించారు. సో ఈ 9 ఎపిసోడ్స్ వరకు తన వర్క్ మాత్రం ఇంప్రెస్ చేసింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘కురుక్షేత్ర’ సిరీస్ నుంచి వచ్చిన 9 ఎపిసోడ్స్ మాత్రం ఆడియెన్స్ ని డెఫినెట్ గా మెప్పిస్తాయి. ఇందులోని అన్ని ఎపిసోడ్స్ అందులోని కథనం, యుద్ధ సన్నివేశాలు, ఎమోషన్స్ వంటివి వీక్షకులని ఆకట్టుకుంటాయి. కురుక్షేత్ర మహాసంగ్రామం ఇలానే జరిగి ఉంటుందా అనే ఆలోచనని కలిగించే ప్రభావం అయితే ఇందులో ఉంది. కొన్ని ఫ్లాస్ వరకు పక్కన పెట్టేస్తే మన ఇతిహాలకి సంబంధించిన ఓ సాలిడ్ యాక్షన్ ప్యాకెడ్ యానిమేషన్ సిరీస్ ని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 9 ఎపిసోడ్ల కురుక్షేత్ర మెప్పిస్తుంది. చూసెయ్యండి.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Exit mobile version