రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో.. ఆస్ట్రేలియాపై రికార్డుల సునామీ సృష్టించిన ఇండియా A

Shreyas-Iyer

ఆస్ట్రేలియా A బౌలర్లకు ఇండియా A బ్యాట్స్‌మెన్ల ధాటికి మైదానం దద్దరిల్లింది. గ్రీన్‌ పార్క్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో ఇండియా A నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 413 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య సెంచరీలు చేయగా, రియాన్ పరాగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఆయుష్ బడోని మెరుపు ఇన్నింగ్స్‌లతో స్కోరు 400 దాటించారు.

ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, 84 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా దూకుడుగా ఆడి 53 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. కేవలం 83 బంతుల్లో 110 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.

ఇక చివరి ఓవర్లలో రియాన్ పరాగ్, ఆయుష్ బడోని తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. పరాగ్ కేవలం 42 బంతుల్లో 67 పరుగులు చేయగా, బడోని 27 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు స్కోరును 400 దాటించాడు. ఈ మ్యాచ్‌లో విల్ సదర్లాండ్ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.

స్వదేశంలో ఇండియా A జట్టు 400 పరుగులు చేయడం ఇదే మొదటిసారి. అలాగే, ఆస్ట్రేలియా A జట్టుపై ఇది అత్యధిక స్కోరు. దీంతో, మూడు వన్డేల సిరీస్‌లో ఇండియా A జట్టు తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. 414 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా A కు ఈ మ్యాచ్ గెలవడం చాలా కష్టం.

Exit mobile version