భాషలతో సంబంధం లేకుండా ఈ సినిమా ఆదరణ పొందాలి – ఎన్టీఆర్

రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార చాప్టర్‌ 1’. ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హైదరాబాద్‌లో ‘కాంతార చాప్టర్‌ 1’ విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘నా చిన్నతనంలో మా అమ్మమ్మ నన్ను కూర్చోబెట్టి కుందాపుర దగ్గరే మా ఊరు అని, మేం ఇలాంటి కథలు వింటూ పెరిగామంటూ వాటిని నాకు చెప్పేది. ఆ కథలు విన్నాక ‘నిజమేనా ? అనిపించేది. నేను విన్న ఆ కథల్ని ఒక దర్శకుడు సినిమాగా తీస్తాడని ఏరోజూ అనుకోలేదు. ఆ చిత్రాలు తీసిన దర్శకుడు రిషబ్‌శెట్టి’ అంటూ ఎన్టీఆర్ తెలిపారు.

ఎన్టీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ‘అరుదైన దర్శకుడు, నటుడు రిషబ్‌. తను 24 విభాగాల్నీ ప్రభావితం చేస్తాడు. ఆయన దర్శకుడు కాకపోతే ఈ చిత్రాన్ని ఈ స్థాయిలో తీయగలిగేవారా అనిపిస్తుంది. ఉడుపి కృష్ణుడి గుడిని సందర్శించాలనేది మా అమ్మ కోరిక. పనులన్నీ మానుకుని రిషబ్, ఆయన భార్య ప్రగతి మాతో వచ్చి దేవాలయాలకు తీసుకెళ్లి దర్శనభాగ్యం కల్పించారు. భాషలతో సంబంధం లేకుండా ఈ సినిమా ఆదరణ పొందాలని కోరుకుంటున్నా’’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించింది. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version