ఓటిటి సమీక్ష: ‘అనగనగా’ – తెలుగు ఒరిజినల్ సినిమా ఈటీవీ విన్ లో

Anaganaga

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 15, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సుమంత్ కుమార్, కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్, అను హసన్, రాకేష్ రాచకొండ, B.V.S. రవి, కౌముది నేమాని
దర్శకులు : సన్నీ సంజయ్
నిర్మాతలు : రాకేష్ రెడ్డి గాదం, రుద్ర మాదిరెడ్డి
సంగీత దర్శకుడు : చందు రవి
సినిమాటోగ్రాఫర్ : పవన్ పప్పుల
ఎడిటర్ : వెంకటేష్ చుండూరు

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ ఒరిజినల్ చిత్రమే “అనగనగా”. టాలెంటెడ్ నటుడు సుమంత్ నటించిన ఈ చిత్రం రిలీజ్ కి ముందు నుంచే మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇలా ఎట్టకేలకి రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

వ్యాస్ (సుమంత్) ఒక స్కూల్ టీచర్ కాగా తన భార్య భాగీ (కాజల్ చౌదరి) అదే స్కూల్ కి ప్రిన్స్ పాల్ గా చేస్తుంది. అయితే విద్యార్ధులకి అందరిలాంటి మోడ్రన్ శైలి పాఠాలు చెప్పడం అనేది వ్యాస్ కి అంతగా నచ్చదు. కాన్సెప్ట్ పరంగా అర్ధవంతంగా చెప్పాలని ట్రై చేస్తాడు. అయితే ఇందుకు తన భార్య వ్యతిరేకంగానే ఉంటుంది. అయితే అదే స్కూల్ చదువుతున్న వారి కొడుకు రామ్ అలాగే ఇంకొంతమంది స్టూడెంట్స్ కీలక ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతారు. ఈ క్రమంలో స్కూల్ మ్యానేజ్మెంట్ వ్యాస్ ని టీచర్ జాబ్ నుంచి తీసేయాలని డిసైడ్ అవుతారు. మరి ఇక్కడ నుంచి వ్యాస్ ఏం చేసాడు? ఆ పిల్లలు అంతా మళ్ళీ పాస్ అయ్యారా లేదా? వ్యాస్ కోరుకున్న విధమైన బోధనా శైలి వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ అనగనగా చిత్రం ప్రస్తుత జెనరేషన్ లో కేవలం ర్యాంక్ లు, మార్కులు కోసం మాత్రమే పని చేస్తున్న విద్యా సంస్థలకి ఒక ప్రశ్న లాంటిది అని చెప్పాలి. వారు అమలు చేస్తున్న విద్యా విధానం ఇలా కాదు చదివే పిల్లలకి ఏం చెప్తున్నారు అనేది కూడా అర్ధం కావాలి అనేది ఈ సినిమాలో బాగుంది. అలాగే దానికి అనుగుణంగా దర్శకుడు మంచి ఫ్యామిలీ డ్రామా అందులో కూడా పలు లేయర్లు యాడ్ చేయడం అనేది అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.

ఇక దీనితో పాటుగా సినిమాలో తండ్రీ, కొడుకుల ట్రాక్ అనేది మరో బలమైన అంశంగా కనిపిస్తుంది. సుమంత్ అలాగే తన కొడుకు పాత్రలో నటించిన మాస్టర్ విహార్ష్ ల నడుమ సన్నివేశాలు హత్తుకునేలా ఉంటాయి. అంతే కాకుండా భార్య భర్తల నడుమ స్పర్థలు, వారి నడుమ జరిగే సున్నితమైన గొడవలు లాంటివి దర్శకుడు డీసెంట్ గా హ్యాండిల్ చేసాడని చెప్పొచ్చు.

ఇక వీటితో పాటుగా సుమంత్ కోసం ప్రత్యేకంగా చెప్పాలి. మన టాలీవుడ్ హీరోస్ లో సుమంత్ ఎంచుకునే సినిమాలు ఒకింత రిఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. పాత సినిమాల్లో చూసుకున్నా కూడా ఇప్పటికీ చూసే విధంగా ఉంటాయి. అలా తన నుంచి వచ్చిన పలు సినిమాల్లో ఈ చిత్రం కూడా ఉంటుందని చెప్పవచ్చు. మళ్ళీ రావా సినిమా తర్వాత తాను ఎలాంటి నటుడు అనేది మళ్ళీ చిత్రంతో చూపించాడు. మన తెలుగు సినిమాలో మంచి అండర్ రేటెడ్ నటుల్లో తాను ఒకరని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అవుతుంది. అంత చక్కగా తన పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో ఉంది.

ఇక తనతో పాటుగా తన భార్యగా చేసిన కాజల్ చౌదరి సాలిడ్ పెర్ఫామెన్స్ అందించారు. ప్రతీ ఎమోషన్ ని ఆమె నాచురల్ గా చేశారు. ఇంకా మాస్టర్ విహార్ష్ ఇంత చిన్న ఏజ్ లో అంత పరిపక్వత గల నటన కనబరచడం ఇంప్రెస్ చేస్తుంది. అలాగే అవసరాల శ్రీనివాస్ తన రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. స్ట్రిక్ట్ స్కూల్ యాజమాన్య సభ్యునిగా మెప్పించాడు. తాను సహా ఇక ఇతర నటీనటులు మంచి నటన కనబరిచారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కథనం బాగుంది కానీ విద్యావ్యవస్థకి సంబంధించిన నేపథ్యంలో ఇది వరకే మనం చాలా సినిమాలు చూసేసాం. సో ఇందులో మరీ అంత కొత్తదనం ఉన్నట్టు అనిపించదు. అలాగే కొన్ని చోట్ల కథనం ఇంకాస్త మెరుగ్గా చేయాల్సింది.

మెయిన్ పాయింట్ లోకి తీసుకెళ్లేందుకు కొంచెం ఎక్కువ సమయమే పట్టింది. అలాగే కొన్ని చోట్ల కథనం ఒకింత ముందే ఊహించే రేంజ్ లోనే ఉండడం అనేది మంచి ఇంట్రెస్టింగ్ కథనాలు కోరుకునేవారికి కనెక్ట్ కాకపోవచ్చు.

అలాగే సుమంత్ ప్రస్తుతం మోడ్రన్ విద్యావ్యవస్థని ప్రశ్నించే తీరు ఇంకొంచెం బలంగా డిజైన్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే తనపై మరిన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు పెట్టాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. మెయిన్ గా చందూ రవి సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. చాలా వరకు ఎమోషనల్ సీన్స్ లో తన స్కోర్ మరింత ఎలివేట్ చేసింది. పవన్ కుమార్ ఇచ్చిన కెమెరా విజువల్స్ బాగున్నాయి. చూసేందుకు ఆహ్లాదంగా సినిమా విజువల్స్ కనిపిస్తాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది. ఓ పది నిమిషాలు కథనం కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు సన్నీ సంజయ్ విషయానికి వస్తే.. తాను తీసుకున్న లైన్ ఓకే కానీ చాలా వరకు కథనం మాత్రం మెప్పించేలా తెరకెక్కించారు. ముఖ్యంగా సుమంత్ పాత్ర, అందులోని ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ మాత్రం ఈ సినిమాలో మెప్పిస్తుంది. అయితే ఇంకొన్ని సన్నివేశాలు మరింత బెటర్ గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ మరింత బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “అనగనగా” చిత్రం నీట్ గా తెరకెక్కించిన ఎమోషనల్ సోషల్ డ్రామా అని చెప్పొచ్చు. ప్రధాన నటీనటులు ఈ చిత్రానికి ప్రధాన బలం కాగా విద్యావ్యవస్థపై అందులోని తండ్రీ కొడుకుల స్టోరీ లైన్ ఆకట్టుకుంటుంది. ఇంకొన్ని సీన్స్ ని బెటర్ గా చేసే స్కోప్ ఉంది కానీ దీనిని పక్కన పెడితే ఓటిటిలో ఈ చిత్రాన్ని తప్పకుండా ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version