డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’ లాంటి విభిన్న తరహా చిత్రాలను తీసి విమర్శకుల ప్రశంశలతో పాటు, తనకంటూ ఓ ప్రత్యేకతని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి భారత్ – పాకిస్థాన్ విడిపోయినప్పుడు జరిగిన ఓ సంఘటనని స్పూర్తిగా తీసుకొని చేస్తున్న సినిమా ‘సాహసం’. నిధి కోసం జరిగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో గోపీచంద్, తాప్సీ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడున్న దర్శకులంతా బాలీవుడ్ లేదా రీమేక్ లపై దృష్టి పెడుతున్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనలో ఉన్నారా అని అడిగితే ‘ అప్పట్లో ‘అనుకోకుండా ఒక రోజు’ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యమని అడిగినా నాకు అంతగా ఇష్టం లేక చెయ్యలేదు. ఇప్పుడు కూడా రిలయన్స్ వారు ‘సాహసం’ రీమేక్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఎం జరుగుతుందో చూడాలి. రిమేక్ అంటే ‘కహాని’ సినిమా బాగా నచ్చి ఎలాగైనా రీమేక్ చేద్దామని ప్రయత్నిస్తుంటే శేఖర్ కమ్ముల తీసుకున్నాడని తెలిసింది. అభిరుచిగల సినిమాలు తీసే శేఖర్ కమ్ముల అంటే నాకు చాలా ఇష్టం. కహాని రీమేక్ కూడా బాగా తీస్తారని’ చంద్రశేఖర్ అన్నాడు.
సాహసం సినిమా మే చివర్లో గానీ, జూన్ మొదట్లో గానీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.