మన దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక శైలి. కొందరు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తారు. కొందరు యువతకు నచ్చేలా సినిమాలు చేస్తారు. ఇంకొందరు కుటుంబ ప్రేక్షకుల మనసు దోచుకునే చిత్రాలను తెరకెక్కిస్తారు. ఎక్కువమంది దర్శకులు మాస్, యూత్ ప్రేక్షకులకు దగ్గరయ్యేవారే ఉంటారు. కుటుంబ ప్రేక్షకులు ఓన్ చేసుకునే దర్శకులు తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటివారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. వారిలో పరశురాం ఒకరు. సినిమా కథలను ప్రశాంతంగా, హడావిడి, గందరగోళం లేకుండా చెప్పడం ఈయన స్టైల్. ఈ ఫోకస్ ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూనే ఉంటుంది.
అలాగని కథలో యాక్షన్ పాళ్ళు తక్కువ ఉంటాయని అనుకోవడానికి లేదు. అవసరమైనప్పుడు ఆ మాసాల కూడ తగులుతుంది. ఈయన కథలు ఎక్కడ మొదలైనా, ఎలా మొదలైనా మధ్యలోకంతా కుటుంబం వద్దకు చేరి, కుటుంబ సభ్యుల మధ్యనే ముగుస్తాయి. మొదటి చిత్రం ‘యువత’తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈయన రవితేజతో ‘ఆంజనేయులు, సారొచ్చారు’ లాంటి చిత్రాలను చేశారు. వాట్ మధ్యలోనే నారా రోహిత్ హీరోగా ‘సోలో’ చిత్రం చేసి కుటుంబ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఫ్యామిలి ఆడియన్స్ లో ఈ సినిమా కి వచ్చిన క్రేజ్ టెలివిజన్ లో రిపీట్ గా టెలికాస్ట్ అవ్వటమే నిదర్శనం. పరుశురాం బుజ్జి దర్శకుడిగా ఫ్యామిలి ఆడియన్స్ చెంతకు చేర్చింది ఈ సినిమా అనే చెప్పాలి.
తరువాత అల్లు శిరీష్ హీరోగా చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రం మరోసారిపరశురాం అంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల దర్శకుడనే మర్కుని గట్టిగా నిలబెట్టింది. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ పతకంపై బన్నీ వాసు నిర్మించిన ‘గీతగోవిందం’ అయితే ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టి దర్శకుడిగా పరశురాం స్టామినాను ప్రూవ్ చేసింది. ఈ సినిమాకు ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ విజయంతో ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం ఈయన సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 25న పరశురాం తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా పరిశ్రమలోని ప్రముఖులంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయన కొత్త చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు.