సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రాన్ని ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. కొన్ని నెలల క్రితమే ఈ చిత్రం యొక్క షూటింగ్ అమెరికాలో మొదలుకావాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. మొదటగా అమెరికాలో షూటింగ్ జరపాలని ఎదురుచూసిన టీమ్ చివరకు మొదటి షెడ్యూల్ హైదరాబాద్లోనే చేయాలని డిసైడ్ అయ్యారు.
త్వరలోనే హైదరాబాద్లో షెడ్యూల్ మెదలుకానుంది. అయితే ఇది పూర్తైన వెంటనే రెండవ షెడ్యూల్ మాత్రం అమెరికాలోనే జరపనున్నారు. ఇందుకోసం చికాగో లొకేషన్ నిర్ణయించారు. అక్కడే ఒక ఒరిజినల్ బ్యాంక్ కార్యాలయంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఈమేరకు అక్కడి స్థానిక అధికారుల నుండి అన్ని అనుమతులు తీసుకున్నారట టీమ్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. ఈ చిత్రం బ్యాంకులు, రుణాల నేపథ్యంలో ఉండనుంది.