సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ చిత్రం ఈమధ్యనే రీస్టార్ట్ అయింది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నారు రజినీ. డిసెంబర్ 31న ఆయన తన పొలిటికల్ పార్టీ గురించి కీలక ప్రకటన చేయనున్నారు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తును అధికారికంగా రివీల్ చేయనున్నారు.
వచ్చే ఏడాదిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో జనవరి నుండి రజినీ పూర్తిగా రాజకీయ పరమైన పనుల్లో నిమగ్నం కానున్నారు. పార్టీ ముఖ్యులతో భేటీలు, అభిమానులతో సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, అభ్యర్థుల ఎంపిక ఇలా అనేక రకాల పనులతో పూర్తిగా బిజీ అయిపోతారు. అందుకే ఈలోపు సినిమాను ముగించాలని చూస్తున్నారు. ఇంకా 40 శాతం వరకు చిత్రీకరణ మిగిలి ఉంది. అందుకే రోజుకు 14 గంటల పాటు షూటింగ్ చేస్తున్నారట సూపర్ స్టార్. కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. రజినీకి జోడీగా నయనతార నటిస్తోంది.