పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ తాజాగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. మొదలియాన్ రెండు లేదా మూడు నెలలోపు సినిమా షూటింగ్ పూర్తైపోతుందని తెలుస్తోంది. ఇందులో రానా కూడ ఒక కీ రోల్ చేయనున్నారు. ఈ చిత్రానికి టైటిల్ కథలోని ఇద్దరు నటుల పాత్రల ఆధారంగా ఉండాల్సి ఉంది. టైటిల్ రివీల్ చేస్తే పవన్, రానా పాత్రల పేర్లు ఏమిటనేది తెలిసిపోతుంది. దీంతో టైటిల్ ఏమిటనే ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో.
మొదటి నుండి ‘బిల్లా – రంగా’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘బిల్లా – రంగా’ అనేది గతంలో చిరంజీవి, మోహన్ బాబులు చేసిన మల్టీస్టారర్ సినిమా పేరు. ఈ పేరునే తమ సినిమాకు పెట్టాలనుకుంటున్నారట పవన్ టీమ్. పవన్ సైతం ఈ టైటిల్ పట్ల సంతృప్తిగా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ పేరునే సినిమాకు ఫైనల్ చేస్తారో లేకపోతే వేరే ఏదైనా ఆలోచిస్తారో చూడాలి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాలో ఫీమేల్ లీడ్స్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.