“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు. తెలుగు భాషలో మాధుర్యం తెలుపడానికి పదాలు సరిపోవేమో. ఏ కవి అందాన్ని వర్ణించినా తెలుగులోనే కదా, మరి తెలుగు అందాన్ని ఏ భాషలో వర్ణించగలం. మన మాతృ భాష తెలుగు గౌరవర్ధకంగా ఈరోజు తిరుపతిలో ప్రపంచ తెలుగు మహా సభలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తిరుపతిలో ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. తెలుగు భాష అంతరించిపోతుందా అనే సమయంలో ఇటువంటి కార్యక్రమం జరగడం నిజంగా ఆనందదాయకం. ఈ ఏర్పాట్లలో భాగంగా తిరుపతిలో మూడు రోజులు పాటు రెండు ధియేటర్ లు ప్రతాప్, బిగ్ సినిమాస్ లలో తెలుగు చలన చిత్రోత్సవం జరుపుతున్నారు ఇందులో భాగంగా తెలుగులోని కొన్ని ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. “మిథునం”, “అన్నమయ్య”, “ఆంధ్రకేసరి”, “శ్రీ కృష్ణ పాండవీయం”, “మాయాబజార్”, “నర్తనశాల”, “శంకరాభరణం”, “భక్త కన్నప్ప” ,”ఓనమాలు” తదితర చిత్రాలను మూడు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. తెర మీద తెలుగుదనం కరువయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం. పర భాషకు గౌరవం ఇద్దాం మాతృ భాషను ప్రేమిద్దాం.