అజిత్ ప్రమాదానికి గురయ్యారా.. అసలు నిజమేంటి ?


తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ‘వాలిమై’ షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీటిలో అజిత్ ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా బైక్ చేజింగ్ సన్నివేశాలను చేస్తున్నారు. చెన్నై నుండి సొంత స్పోర్ట్స్ బైక్ తెప్పించుకుని మరీ వాడుతున్నారు అజిత్. అయితే తాజాగా షూటింగ్లో భాగంగా స్టంట్స్ చేస్తున్న అజిత్ కు చిన్నపాటి ప్రమాదం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమాదంలో అజిత్ కు చిన్నపాటి గాయాలైనట్టు చెబుతున్నారు.

నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోందని, భయపడాల్సిన పనేమీ లేదని, గాయాలు చిన్నపాటివేనని అంటున్నారు. అయితే ఈ విషయమై ఖచ్చితమైన సమాచారం అయితే లేదు. ఈ సంగతి తెలిసిన అభిమానులు కంగారుపడుతున్నారు. తమ హీరోకు ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్ర బృందం ఈ విషయమై స్పందించి వాస్తవం ఏమిటో క్లారిటీ ఇస్తే బాగుంటుంది. హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొనీకపూర్ నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.

Exit mobile version