ఈమధ్య తెలుగు ప్రేక్షకులు, స్టార్ హీరోల అభిమానులకు క్రియేటివిటీ పాళ్ళు బాగా ఎక్కువైపోయాయి. ఏదైనా సినిమా అధికారికంగా ప్రకటించబడితే చాలు వాటి మీద ఊహాజనిత ఫస్ట్ లుక్ పోస్టర్లు రూపొందించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఆ పోస్టర్లు మామూలుగా ఉండట్లేదు. హైక్వాలిటీతో ఉంటున్నాయి. అభిమానుల ఎడిటింగ్ ప్రతిభతో ఒక్కోసారి అవి నిజంగానే నిర్మాణ సంస్థ నుండి బయటికొచ్చాయా అనే అనుమానం కలిగేలా ఉంటున్నాయి. వాటిని చూసి ఒక్కోసారి హీరోలు, దర్శకులే షాకవుతుంటారు.
తాజాగా అలాంటి షాకే ప్రభాస్ దర్శకుడికి తగిలింది. హిందీ డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ యొక్క ‘ఆదిపురుష్’ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటివరకు టైటిల్ లుక్ మాత్రమే బయటికిరాగా రాముడిగా ప్రభాస్ లుక్ మీద ఒక పోస్టర్ రిలీజ్ చేయమని అభిమానులు చాలా రోజుల నుండి అడుగుతూనే ఉన్నారు. కానీ దర్శకనిర్మాతలు అప్పుడే లుక్ రివీల్ చేయకూడదనే ఉద్దేశ్యంతో లుక్ బయటకి వదల్లేదు.
దీంతో విసుగు చెందిన అభిమానులు అఫీషియల్ పోస్టర్ వచ్చే వరకు మేము ఆగలేము అంటూ వాళ్ళే సొంతగా శ్రీరాముడి గెటప్‌లో ప్రభాస్ పోస్టర్ ఒకటి డిజైన్ చేసి వదిలారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చివరికి డైరెక్టర్ ఓం రౌత్ సైతం ఆ పోస్టర్ చూసి స్టన్నింగ్ అంటూ సప్రైజ్ ఫీలై డిజైన్ చేసినవారిని అభినందించారు. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉంది.