ఏ హీరో అభిమానికి మాత్రం తమ అభిమాన హీరో ఎక్కువ సినిమాలతో అలరించాలని కోరుకోరు? కానీ తన కెరీర్ ను కేవలం ఒకే సినిమాకు ఐదేళ్లు అంకితం ఇచ్చేసాడు ప్రభాస్. దీనితో ఆ ఐదేళ్లలో చెక్కు చెదరని రికార్డులు సెట్ చేసిన రెండే సినిమాలు వచ్చినా ఎక్కువ కాలం గ్యాప్ వచ్చిందనే చిన్న నిరాశలో కూడా ప్రభాస్ అభిమానులు పడ్డారు.
దానితో ప్రభాస్ అప్పుడు వారి కోసం సంవత్సరానికి రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేస్తానని బాహుబలి 2 ఫంక్షన్ లో మాటిచ్చాడు. కానీ ఆ తర్వాత చేసిన “సాహో”తో రివర్స్ లో రెండు సంవత్సరాలకి ఒక సినిమాయే పూర్తయ్యింది. దీనితో మళ్ళీ షరా మామూలే అయ్యింది. కానీ ఇప్పుడు కాదు కానీ ఆ తర్వాత మాత్రం ప్రభాస్ చెప్పిన మాట తీరేలా ఉందని చెప్పాలి.
ఇప్పుడు దర్శకుడు రాధాకృష్ణ తో చేస్తున్న “రాధే శ్యామ్” చిత్రం తర్వాత తీయనున్న రెండు చిత్రాలను ఏకకాలంలో పూర్తి చేయడమే కాకుండా ఒకే ఏడాదిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. దీనితో ప్రభాస్ అప్పుడు ఇచ్చిన మాట కాస్త లేట్ గా అయినా రాబోయే రోజుల్లో తీరనుంది అని చెప్పాలి.