ఎన్నడూ లేనంతగా కష్ట పడుతున్న శంకర్.!


సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర తన రాబోయే ‘మనోహరుడు’ అనే రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా కోసం ఎన్నడూ లేనంతగా కష్టపడుతున్నాడు. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ ఒక కథానాయికగా నటిస్తుండగా మరో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. గత కొన్ని రోజుల క్రిత్రం సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా ఇప్పటి వరకూ 41 రోజులు చిత్రీకరణ జరుపుకుంది. ఈ 41 రోజుల చిత్రీకరణలో శంకర్ ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక పాట మరియు కొన్ని సన్నివేశాలను మాత్రమే షూట్ చేసారని సమాచారం. ‘మనోహరుడు’ (తమిళంలో ‘ఐ’) ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా ఉండాలని శంకర్ ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే ఈ సినిమా గురించి విక్రమ్ మాట్లాడినప్పుడు ‘అపరిచితుడు’ కంటే ఈ సినిమా 100 రెట్లు బాగుంటుందని అన్నారు. ఇప్పటి వరకూ శంకర్ తీసిన చిత్రాల్లో ఒక్క ‘స్నేహితుడు’ చిత్రం తప్ప మిగిలిన అన్ని చిత్రాలు ఆంధ్రప్రదేశ్లో సూపర్ హిట్ అయ్యాయి. ‘మనోహరుడు’ కోసం శంకర్ కష్ట పడుతున్న తీరు చూస్తుంటే 2013లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి. సి శ్రీ రామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆస్కార్ రవి చంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version