నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటులలో ఒకరు. ఇప్పటి వరకు నటకిరీటి ఎన్నో కామెడీ పాత్రల్లో, సీరియస్ పాత్రల్లో నటించారు. గత కొన్ని సంవత్సరాలుగా తనదైన శైలిలో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘ఓనమాలు’ మరియు ‘జులాయి’ చిత్రంలో చేసిన పోలీస్ పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘డ్రీం’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నటకిరీటి సరికొత్త లుక్ తో కనిపించనున్నారు.
భవాని శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ మైనం మరియు సతీష్ మైనం సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘ ఇప్పటి వరకూ ఈ చిత్రం లాంటి కథ ఇంతకు ముందు తెలుగు చలన చిత్ర రంగంలో రాలేదు. రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బాగుంటుంది మరియు అతను కొత్త లుక్ తో కనిపించనున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన వారు కూడా చాలా బాగుందని అన్నారు. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని’ అన్నారు.
ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇది ఒక థ్రిల్లర్ సినిమా. ఎలాంటి సంబంద భాందవ్యాలు లేని ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్ చుట్టూ తిరిగే కథ. అతని ఒంటరితనం వల్ల అతని లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా చూసినంత సేపు థ్రిల్లింగ్ గా ఉంటుందని’ ఆయన అన్నారు. ఈ పాత్రతో రాజేంద్ర ప్రసాద్ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారో అనే దానికోసం కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.