వరుణ్ సందేశ్ హీరోగా మరియు హరిప్రియ కథానాయికగా నటించబోయే కొత్త చిత్రం ఈ రోజు రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది. లక్ష్మణ్ సినీ విషన్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కేదారి నిర్మించనున్న ఈ చిత్రానికి కోనేటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు క్లాప్ నివ్వగా, సంపత్ నంది కెమరా స్విచ్ ఆన్ చేశారు మరియు జి. నాగేశ్వర రెడ్డి మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్ర నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ ” ‘మేము వయసుకు వచ్చాం’ చిత్రం తర్వాత మా బ్యానర్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది. మొదటి చిత్రానికి పనిచేసిన టీం మొత్తం ఈ చిత్రానికి కూడా పనిచేయనుందని, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై 13 నుంచి హైదరాబాద్లో ప్రారంభమవుతుందని’ ఆయన అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ” ఈ చిత్ర కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందని, ఈ చిత్రంతో హరిప్రియ మంచి పేరు తెచ్చుకుంటారని” అన్నాడు. హీరోయిన్ హరిప్రియ మాట్లాడుతూ ” తెలుగులో ఇది నా మూడవ చిత్రం, ‘పిల్ల జమిందార్’ విజయం సాదించినప్పటికీ ఆ చిత్రంలో తన పాత్ర చిన్నది అయినందువల్ల అంత గుర్తింపు రాలేదని, కానీ ఈ చిత్రం తనకి మంచి పేరు తెస్తుందని పూర్తి నమ్మకం ఉందని అన్నారు”. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నారు.