యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం “శిరిడి సాయి”. మంగళవారం గురు పౌర్ణమి సందర్భంగా ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు, ఇందులో నాగార్జున మాట్లాడుతూ ” ఇప్పటివరకూ ‘అన్నమయ్య’ మరియు ‘శ్రీ రామదాసు’ చిత్రాలలో భక్తుడి పాత్రల్లో కనిపించాను. ఈ చిత్రంలో దేవుడి అవతారంలో మొదటి సారిగా కనిపించాబోతున్నాను. బాబా గురించి తనకి పెద్దగా అవగాహన లేదని, ఈ సినిమా ప్రారంభానికి రెండు నెలల ముందే బాబా ఫోటోలు కొన్ని ఇంటికొచ్చాయి అవి చూసినప్పటి నుంచి తనలో ఏదో తెలియని ఆసక్తి మొదలవడంతో వెంటనే శిరిడి వెళ్లి బాబాని దర్శనం చేసుకున్నాను. శిరిడి నుంచి రాగానే రాఘవేంద్ర రావు కథ చెప్పారు, వెంటనే చిత్రీకరణ మొదలు పెట్టి సినిమాని పూర్తి చేశామని చెప్పారు. ఈ చిత్రం చేస్తున్నన్ని రోజులూ బాబా తనకి ఏదో ఒక రూపంలో కనిపించే వారని చెప్పారు. ఈ పాత్రని ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో సెట్లో ‘ ఓం సాయి శ్రీ సాయి’ అనే పాటని వినగానే తనకే తెలియని ఒక మైకంతో చేసేశానని, పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లే బాబా పాత్ర చేసే అవకాశం లబించిందని ఆయన అన్నారు”.
ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి మాట్లాడుతూ ” ఈ చిత్రంలో మొత్తం 13 పాటలున్నాయి. అందులో ఒక పాట ‘అల్లరి మొగుడు’సినిమా సమయంలో బాబా మీద ఒక పాట చేశాను. ఇప్పటి వరకూ ఆ పాటను ఉపయోగించడానికి సరైన సందర్భం రాలేదు 20 సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో ఆ పాటని పెట్టాము అని ఆయన అన్నారు”. కేవలం 60 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోని ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ. మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.