‘మాస్టర్’తో విజయ్ కోరిక తీరేలానే ఉంది ?

తమిళ హీరోలు తెలుగు మార్కెట్ మీద చాలా కాలం నుండే ఆసక్తి చూపుతన్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు విడుదలకు కూడ మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, సూర్య, కార్తి, ధనుష్ లాంటి హీరోలు తెలుగునాట స్టాండర్డ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈమధ్య విజయ్, అజిత్ కూడ బాగానే ప్రభావం చూపుతున్నారు. ముఖ్యంగా విజయ్ తెలుగు మార్కెట్లో పాగా వేయాలని చాలా కాలం నుండి ట్రై చేస్తున్నారు. గత చిత్రం ‘విజిల్’తో ఆయన ప్రయత్నం కొంతవరకు ఫలించింది. ఆ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టుకుంది.

ఇక కొత్త చిత్రం ‘మాస్టర్’తో ఆ స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు విజయ్. అందుకే సినిమాను భారీ ఎత్తున తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13వ తేదీన 670 స్క్రీన్లలో సినిమా విడుదలకానుంది. ఒక్క హైదరాబాద్లోనే 160 స్క్రీన్లలో రిలీజ్ కానుంది. ఇదే ఇప్పటివరకు విజయ్ కు అతిపెద్ద రిలీజ్. పైగా రేపు పండుగ కావడం, సోలో రిలీజ్ కావడం సినిమాకు కలిసిరానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడ బాగానే ఉన్నాయి. చూడబోతే ఈసారి తలపతి గట్టిగానే కొట్టేలా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మహేష్ కోనేరు విడుదల చేస్తున్నారు.

Exit mobile version