సమీక్ష : ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో – గ్రామీణ నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా

Pre-wedding-show

విడుదల తేదీ : నవంబర్ 07, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్ తదితరులు
దర్శకుడు : రాహుల్ శ్రీనివాస్
నిర్మాత : అగరం సందీప్
సంగీత దర్శకుడు : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్ : సోమ శేఖర్
ఎడిటర్ : నరేష్ అడుప

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ నేడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రమేష్‌ (తిరువీర్‌) తన స్నేహితుడు రామ్‌ చరణ్‌ (మాస్టర్‌ రోహన్‌ రాయ్‌)తో ఫోటో స్టూడియో నడుపుతాడు. ఎదురుగా ఉన్న పంచాయతీ కార్యాలయంలో పనిచేసే హేమ (టీనా శ్రావ్య)పై అతనికి ప్రేమ పుడుతుంది. ఒక రోజు ఆనంద్‌ (నరేంద్ర రవి) తన ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం రమేష్‌ను సంప్రదిస్తాడు. షూట్‌ బాగా జరిగిందనుకున్న సమయంలో, రామ్‌ చరణ్‌ నిర్లక్ష్యం వల్ల వీడియో ఉన్న మెమరీ కార్డ్‌ పోతుంది. ఆ చిప్‌ను వెతికే రమేష్‌ ప్రయాణమే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు సోషల్ మీడియా మీమ్స్‌ లేదా ట్రెండింగ్ డైలాగ్స్‌ ఆధారంగా హాస్యాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఈ తరహా ప్రయత్నాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవు. ఎందుకంటే కొంతమందికి ఆ ట్రెండ్స్‌ లేదా మీమ్స్‌ గురించి అవగాహన లేకపోవచ్చు. అయితే ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అలాంటి సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

ఈ సినిమా కథలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకున్నారు. కథకు సంబంధం లేని ప్రత్యేక కామెడీ ట్రాక్స్‌ బలవంతంగా అనిపించవచ్చు.. కానీ కథనంలో నుంచి పుట్టే సరదా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదే అంశం ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షోను మరింత ఆసక్తికరంగా, ఆస్వాదనీయంగా మార్చుతుంది.

చిన్న పట్టణ నేపథ్యం, అమాయకమైన పాత్రలు, గందరగోళానికి దారి తీసే ముఖ్యమైన సంఘటన, సహజంగా వచ్చే హాస్యం, అలాగే హీరో తన స్టూడియో వ్యాపారాన్ని కాపాడుకునే ప్రయత్నం.. ఇలాంటివి అన్నీ ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వు తీసుకువస్తాయి. మొదట హీరో చేసే పనులు సందేహాస్పదంగా అనిపించినా, రెండో భాగంలో అతని పాత్రకు అందమైన పరిష్కారం లభిస్తుంది.

రెండో భాగంలో కామెడీ బాగా పండింది. అయితే సరదా కంటే భావోద్వేగాలు మరింతగా హత్తుకుంటాయి. ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌ వెనుక ఉన్న అర్థాన్ని కథా పరిణామాలతో అనుసంధానం చేసిన తీరు హృదయాన్ని తాకుతుంది. ఫోటోగ్రాఫర్‌గా తిరువీర్‌ అద్భుతంగా నటించాడు. మాస్టర్ రోహన్‌పై చూపించే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. వరుడి పాత్రలో నటించిన నరేంద్ర రవి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టీనా శ్రావ్య, యామిని నాగేశ్వర్ తమ పాత్రల మేర మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

హీరో-హీరోయిన్‌ల మధ్య ఉన్న ప్రేమ కోణాన్ని మరింతగా ఆవిష్కరించి ఉంటే సినిమా మరో స్థాయికి చేరుకునేదేమో. ఫస్టాఫ్‌లో ఒక ఎమోషనల్ ప్రేమకథ ఉండబోతుందని చూపెట్టినా.. దానిని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు.

హీరో-హీరోయిన్‌ల మధ్య కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నా.. అలాంటి సీన్స్ మరికొన్ని ఉంటే బాగుండు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ మరింత బలంగా ఉండి ఉంటే ప్రభావం ఇంకాస్త పెరిగేది.

సాంకేతిక విభాగం :

రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాకు రైటర్, డైరెక్టర్‌గా మంచి ట్యాలెంట్ చూపించాడు. కథలో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక సురేష్ బొబ్బిలి సంగీతం వినసొంపుగా ఉంది. బీజీఎం కూడా చక్కగా కుదిరింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా, ప్రీ-వెడ్డింగ్ షో ఓ చక్కటి కథనంతో, నవ్వించే కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. అమాయకమైన పాత్రలు, వారి మధ్య వచ్చే ఆర్గానిక్ కామెడీ, పరిస్థితులను బట్టి వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. అయితే, ఇలాంటి కథకు ఇంకాస్త బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది. లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్‌ను ఇంకాస్త బలంగా చూపెట్టాల్సింది. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించే విధంగా ఉండటం మైనస్. ఫీల్ గుడ్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version