సమీక్ష : ‘కాంతార చాప్టర్ 1’ – యాక్షన్ తో సాగే గ్రాండ్ విజువల్ ఎంటర్ టైనర్ !

Kantara-Chapter-1

విడుదల తేదీ : అక్టోబర్ 2, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్,జయరామ్, రాకేష్ పూజారి
దర్శకుడు : రిషబ్ శెట్టి
నిర్మాతలు : విజయ్ కిరగందూర్
సంగీత దర్శకుడు :  బి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్ : అరవింద్ ఎస్. కశ్యప్,
ఎడిటర్ : సురేష్ మల్లయ్య

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘కాంతార చాప్టర్ 1’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ :

కాంతార ముగింపు దగ్గరే ఈ కథ మొదలైంది. పంజుర్లి జాతర తర్వాత అడవిలో మాయమైపోయిన తన తండ్రి గురించి తెలుసుకోవడానికి శివ (చైల్డ్ రిషిబ్ శెట్టి) తాపత్రయపడుతుంటాడు. ఆ మాయం అయ్యే విషయం వెనుక దశాబ్దాల చరిత్ర ఉంటుంది. కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే రాజు రాజ్యం ఉంటుంది. రాజశేఖర్ వంశం ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ల ఆధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బర్మ (రిషబ్ శెట్టి) ఉంటాడు. తన ప్రజల కోసం బర్మ ఏకంగా రాజ్యంలోకే వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బర్మ, కనకావతి (రుక్మిణి వసంత్)కి దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?, బర్మ తన కాంతార కోసం ఏం చేశాడు ?, అసలు బర్మ ఎవరు ?, అతను ఎక్కడ నుంచి వచ్చాడు ?, ఈ మధ్యలో కనకావతి పాత్ర ఏమిటి ?, ఆమె టార్గెట్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కూడా కాంతార ఆత్మ సజీవంగా ఉండేలా రిషబ్ శెట్టి తన ప్రతిభను కనబరిచారు. అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా రిషబ్ శెట్టి మెప్పించాడు. సాంప్రదాయాలు, సంస్కృతితో ముడిపెట్టి నడిపిన కథనం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి. కీలక సన్నివేశాల్లో రిషిబ్ శెట్టి అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది.

ఈ సినిమా కూడా భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో రిషిబ్ శెట్టి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. రాజుగా జయరాం తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. విలన్ గా నటించిన గుల్షన్ దేవయ్య అద్భుతంగా నటించాడు. ఇక కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్ జీవించింది.

రుక్మిణి వసంత్ స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన రాకేష్ పూజారితో పాటు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. రిషిబ్ శెట్టి కమర్షియల్‌ మూవీకి అనుగుణంగానే ప్లేను నడుపుతూ.. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను, అలాగే కామెడీ టచ్ ను కూడా సమపాళ్లలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది. అదే విధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.

మైనస్ పాయింట్స్ :

బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘కాంతార: చాప్టర్ 1’ చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక రిషిబ్ శెట్టి – విలన్ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. సురేష్ మల్లయ్య ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. రిషిబ్ శెట్టి రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. నిర్మాత విజయ్ కిరగందూర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

డివోషనల్ టచ్ తో వైల్డ్ యాక్షన్ అండ్ గ్రాండియర్ విజువల్స్‌ తో వచ్చిన ఈ ‘కాంతార: చాప్టర్ 1’లో.. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రిషిబ్ శెట్టి పవర్ ఫుల్ నటన మరియు దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ, ఒకటి రెండు సన్నివేశాలు రోటీన్ గా సాగడం కాస్త మైనస్ అయింది. అయినప్పటికీ, రిషిబ్ శెట్టి తన నటనతో, కాంతార ఇమేజ్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం కాంతార అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version