విడుదల తేదీ : జూలై 11, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : రాజ్ కుమార్ రావు, ప్రొసెన్‌జిత్ ఛటర్జీ, మానుషి చిల్లర్, హుమా ఖురేషి, సౌరభ్ సచ్‌దేవ, సౌరభ్ శుక్ల తదితరులు
దర్శకత్వం : పుల్కిత్
నిర్మాతలు : కుమార్ తౌరాని, జే షేవక్రమాని
సినిమాటోగ్రఫీ : అనుజ్ రాకేష్ ధావన్
సంగీతం : సచిన్-జిగర్, కేతన్ సోధ
ఎడిటర్ : జుబిన్ షేక్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాలిక్’. పుల్కిత్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
90ల కాలంలో అలహాబాద్‌లో సాగే ఈ కథలో మాలిక్ అలియాస్ దీపక్ (రాజ్ కుమార్ రావు) ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని చూస్తుంటాడు. తనకు గురువుగా ఉండే దద్దా అలియాస్ శంకర్ సింగ్(సౌరభ్ శుక్లా) మాటలను తూచా తప్పకుండా పాటిస్తుంటాడు మాలిక్. అయితే, ఈ క్రమంలో తనకు ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి..? తన కుంటుంబం తన పనుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది..? మాలిక్‌కు ఇంకా ఎలాంటి కొత్త సమస్యలు వచ్చి పడతాయి..? తన లక్ష్యం కోసం అతడు ఏమేం కోల్పోతాడు..? చివరకి మాలిక్ ఏం అవుతాడు..? అనేది ఈ చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్ :
రాజ్ కుమార్ రావు సినిమా అంటే అందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇక ఈ సినిమాలో కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామాకు కావాల్సిన కంటెంట్ ఉంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్‌ల విషయానికి వస్తే రాజ్ కుమార్ రావు మరోసారి తనదైన నటనతో ఈ సినిమాను క్యారీ చేశాడు.
యాక్షన్, ఎమోషన్స్, ఇలా అన్నింటిలోనూ రాజ్ కుమార్ రావు ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా నలుగురు దుండగులను శిక్షించే సీన్‌లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ సూపర్. ఇక ఈ సినిమాలోని డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మిగతా నటీనటుల్లో ప్రొసేన్‌జిత్ ఛటర్జీ, సౌరభ్ సచ్‌దేవ్, స్వానంద్ కిర్కీరే, మానుషి చిల్లర్, సౌరభ్ శుక్ల పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్‌గా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు రొటీన్ కథ మేజర్ డ్రాబ్యాక్‌గా నిలిచింది. ఇలాంటి గ్యాంగ్‌స్టర్ కథలు చాలా సినిమాల్లో వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు ఈ కథ పరమ రొటీన్‌గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో కథ ఎంత త్వరగా ముందుకు వెళ్తుందో.. సెకండాఫ్‌లో అంతే స్లోగా సాగుతుంది.
ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో మేకర్స్ చాలా కేర్ తీసుకోవాల్సింది. ఈ సినిమాలోని పాత్రలు, వారి మధ్య జరిగే సన్నివేశాలు చాలా చప్పగా సాగుతాయి. ఇక ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగుతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి తగ్గుతుంది.
ఈ సినిమాలో మాలిక్ పాత్రను ట్రీట్ చేసిన విధానం బాగున్నా, దానిని పర్ఫెక్ట్‌గా డిజైన్ చేయలేకపోయారు అని సినిమా చూస్తే అనిపిస్తుంది. ఇక హీరోయిన్ పాత్రను ఇంకా బలంగా రాసుకోవాల్సింది. సంగీతం పరంగా సాంగ్స్ బాగున్నా, వాటి ప్లేస్‌మెంట్ మెప్పించదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు పుల్కిత్ తెరకెక్కించిన ఈ సినిమా కథలో కొత్తదనం మిస్ అయింది. చాలా రొటీన్ టెంప్లేట్‌తో ఈ కథ రావడం సినిమాకు డ్యామేజ్ చేసింది. స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకులను మెప్పించదు. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ కథకు తగ్గట్టుగా పనిచేసింది. సంగీతం పరంగా పాటలు ఆకట్టుకుంటాయి. బీజీఎం వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా ‘మాలిక్’ చిత్రం ఓ రొటీన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రాజ్ కుమార్ రావు నటన, కొన్ని పాటలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. రొటీన్ కథ, స్లోగా సాగే స్క్రీన్ ప్లే, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్. యాక్షన్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team