‘మటన్ సూప్’ విజయంతో ఆనందంగా ఉంది – నిర్మాత మల్లిఖార్జున ఎలికా

‘మటన్ సూప్’ విజయంతో ఆనందంగా ఉంది – నిర్మాత మల్లిఖార్జున ఎలికా

Published on Oct 12, 2025 7:00 PM IST

‘మటన్ సూప్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చిందని నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) తెలిపారు. అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ పతాకాలపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన తన సినిమా ప్రయాణం, చిత్ర విశేషాలు మీడియాతో పంచుకున్నారు.

సినిమాపై ఉన్న ప్రేమతోనే ఈ ప్రయాణం తన స్వస్థలం తిరుపతి అయినా, సినిమా రంగానికి దగ్గర చేసింది మాత్రం హైదరాబాద్ అని మల్లిఖార్జున ఎలికా అన్నారు. చిన్నతనం నుంచే సినిమాలంటే పిచ్చి అని, ఆ ఆసక్తితోనే రచనా విభాగంపై దృష్టి పెట్టానని చెప్పారు. తాను తీసిన షార్ట్ ఫిల్మ్ ‘బడి పంతులు’కి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తనను తెరపై చూడాలని తన తల్లి కలలు కనేవారని, ఆ కల ఇప్పుడు నిజమైందని, అయితే అది చూడటానికి ఆమె లేకపోవడం బాధగా ఉందని భావోద్వేగానికి గురయ్యారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అన్ని విభాగాల్లో పనిచేశానని, నటనలో శిక్షణ పొంది, చాలామందికి నేర్పించానని తెలిపారు. తాను దర్శకత్వం వహించనున్న ఒక హారర్ సినిమా ప్రస్తుతం నిర్మాణంలో ఉందని వెల్లడించారు.

‘మటన్ సూప్’ చిత్రానికి ముందు కో-డైరెక్టర్‌గా చేరానని, అయితే దర్శకుడు రామచంద్ర ప్యాషన్ చూసి నిర్మాతగా మారానని మల్లిఖార్జున ఎలికా వివరించారు. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిందని, ప్రేక్షకులకు కథ తెలిసినా, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించామని చెప్పారు. తమ సినిమా కథ పేపర్‌పై కాకుండా ఎడిటింగ్ టేబుల్‌పైనే రూపుదిద్దుకుందని గర్వంగా తెలిపారు.

సినిమా విజయానికి కారణమైన నటీనటులు, సాంకేతిక బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హీరో రమణ్, హీరోయిన్ వర్ష విశ్వనాథ్, మరియు జెమిని సురేష్ సహకారం మర్చిపోలేమని అన్నారు. అలాగే, వెంకీ వీణ అందించిన పాటలు, ఆర్.ఆర్. సినిమాకు బలంగా నిలిచాయని, భరద్వాజ్, ఫణింద్ర విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

భవిష్యత్తులో కూడా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తానని, కొత్తవారితో మరిన్ని చిత్రాలు నిర్మిస్తానని మల్లిఖార్జున ఎలికా తెలిపారు. తాను దర్శకత్వం వహించనున్న హారర్ సినిమాతో పాటు, దర్శకుడు రామచంద్రతో మరో ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నామని, ఈ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు