హారర్ జోనర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఇదే స్ట్రాటెజీపై సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆర్.రఘన్ రెడ్డి నిర్మాతగా సాయి కృష్ణ దర్శకత్వంలో అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పంజరం’. పూర్తి హారర్ చిత్రంగా రానున్న ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ‘పేదరాసి పెద్దమ్మ’ అంటూ ఓపెన్ చేసిన ట్రైలర్లోని నేపథ్యం, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. హారర్ మూవీకి ఉండాల్సిన కెమెరా వర్క్, ఆర్ఆర్ ‘పంజరం’లో కనిపించాయి. ట్రైలర్లో చివరి షాట్ మాత్రం అందరినీ భయపెట్టించేలా ఉందని చెప్పాలి.
ఇక ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ .. ‘నాకు ఈ ప్రయాణంలో సహకరించిన టీంకు థాంక్స్. మోహన్ గారి మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఆర్ఆర్, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అనిల్, యువతేజ, ముస్కాన్, రూప కి థాంక్స్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా సినిమాకు ఆడియెన్స్, మీడియా సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
హీరో యువతేజ మాట్లాడుతూ.. ‘పంజరం’ చిత్రంలో నేను మల్లి అనే పాత్రను పోషించాను. నా పాత్ర, లుక్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. మా దర్శకుడు సాయి ఈ మూవీని గొప్పగా తీశారు. అనిల్ నాకు చిన్ననాటి స్నేహితుడు. రూప, ముస్కాన్ అద్భుతంగా నటించారు. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
హీరో అనిల్ మాట్లాడుతూ.. ‘‘పంజరం’ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇందులో నేను కార్తిక్ అనే పాత్రను పోషించాను. మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రూప, ముస్కాన్లతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ నాని మోహన్, నటి పద్మ, నటుడు రమణ, ప్రదీప్ తదితరులు పాల్గొని మాట్లాడారు.