మొదటి నుంచి ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడం కోసం విప్లవాత్మక చిత్రాలు మాత్రమే తీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో స్థానం దక్కించుకున్న నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి. ఎప్పుడు ప్రజల సమస్యల్లో నుంచి కథల్ని ఎన్నుకొని సినిమాలు తీసే నారాయణమూర్తి తాజాగా గత సంవత్సరం జరిగిన నిర్భయ ఘటనని ఇతివృత్తంగా చేసుకొని ‘నిర్భయ భారతం’ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.
ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లామర్, కరెన్సీ, లగ్జరీ చుట్టూ సినీ సెలబ్రిటీ జీవితం ముడిపడి ఉంటుంది. కానీ మీరు మాత్రం ఎందుకు సాధారణ జీవితం గడుపుతున్నారు? అని అడిగితే సమాధానం ఇస్తూ ‘ నేను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాను. కార్లు, బంగ్లాలు కొనుక్కోవాలంటే కొనుక్కునే వాన్ని కానీ నేను ఇలా ఉండటానికి కారణం నా మెంటాలిటీ. ఎవరో గొప్పగా చెప్పుకోవాలని ఇలా ఉండను, ఇలా ఉండడం నాకిష్టం కాబట్టి ఉంటాను. ఎవరి కోసమూ నా స్వభావాన్ని మార్చుకోను. ఇక గ్లామర్.. అదినాకు లేకపోతే మీరొచ్చి నా ఇంటర్వ్యూ ఎందుకు తీసుకునేవారు. మా గురువు దాసరి నారాయణరావు గారు నన్ను ‘పీపుల్స్ స్టార్’ అంటారు, నాకు భారతరత్న కన్నా అదే గొప్ప బిరుదు. మన సినిమా రంగంలో అన్న అంటే ఎన్.టి.ఆర్, ఆయన తర్వాత అన్న అని నన్నే అంటారు. అలాగే స్వదేశీ భారతి అనే బెంగాలి రచయిత ఆయన రాసిన అరణ్యక్ అనే పుస్తక ముఖ చిత్రంగా నా ఫోటో వేసారు. అలాగే పూరి జగన్నాథ్ తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని నాకు అంకితం ఇచ్చాడు. ఇంతకూ మించిన గౌరవం ఉంటుందా? ఈ తృప్తి నాకు చాలు బ్రదర్’ అని నారాయణమూర్తి సమాధానం ఇచ్చాడు.