ఈ వారం రిలీజ్‌కు రెడీ అయిన ‘కాంత’ సినిమాకు అనుకోని సమస్య ఎదురైంది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బొర్సె, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తన తాత ఎం.కె.త్యాగరాజ భాగవతార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసారని.. ఎలాంటి కుటుంబ అనుమతి లేకుండా నిర్మించారని ఆయన మనవడు బి.త్యాగరాజన్ కోర్టును ఆశ్రయించాడు.
చెన్నై సివిల్ కోర్టు నవంబర్ 18 లోపు సమాధానం ఇవ్వాలని చిత్ర యూనిట్‌ను ఆదేశించడంతో సినిమా రిలీజ్‌పై డైలమా ఏర్పడింది. ఇప్పటికే తెలుగు, తమిళ వెర్షన్లకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ చిత్ర హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. సినిమా పాక్షికంగా ఎం.కె.టి జీవితానికి ప్రేరణతో రూపొందించామని.. కథలో చాలా భాగం కల్పితమని అన్నారు.
అయితే, దర్శకుడు-ఫిల్మ్‌మేకర్ ఈగో వార్ చుట్టూ కథ తిరుగుతుందని చెప్పడం కొత్త చర్చకు దారి తీసింది. ఎం.కె.టి తక్కువ సినిమాలు చేసినా అన్నీ హిట్స్ కావడం, తరువాత హత్య కేసులో ఇరుక్కోవడం వంటి విషయాలు సినిమాలో ఉన్నాయా అన్నది ఆసక్తిగా మారింది. నిర్మాత రానా దగ్గుబాటి, హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఈ వివాదం నుండి ఎలా బయటపడతారు.. సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా అన్నది కీలకంగా మారింది.
