మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అయితే, మోహన్ లాల్ కి అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సంగతి తెలిసిందే. మోహన్‌లాల్‌ను కేరళ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. సీఎం పినరయి విజయన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మోహన్‌లాల్‌ను సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ.. ‘నేను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నప్పుడు, నాకు చాలా విషయాలు గుర్తుకు వచ్చాయి. గతంలో ఈ అవార్డుకి ఎంపికైన వారితో పాటు, ఇండియన్ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే సేవలు కూడా నాకు గుర్తుకు వచ్చాయి. ఈ అవార్డు నాకో ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. 48 ఏళ్ల క్రితం సినిమా గురించి నాకేమీ తెలియదు. నేను, మరికొందరు స్నేహితులు కలిసి ఓ చిన్న సినిమా తీయాలనుకుంటే.. నా ఫొటోలు దర్శకులు ఫాజిల్ దృష్టికి వెళ్లాయి. అలా నాకు ‘మంజిల్ విరింజ పూవు’లో అవకాశం వచ్చి.. ఈ స్థాయికి వచ్చాను.’ అని మోహన్ లాల్ తెలిపారు.