బాలీవుడ్ లో 10 కాదు 20 కాదు సుమారు 60 సంవత్సరాల పాటు సక్సెస్ ఫుల్ నిర్మాతగా సినిమాలను నిర్మించిన యశ్ చోప్రా ఈ మధ్యనే స్వర్గస్తులు కావడం అందరికీ తెలిసిందే. ఆయనకి స్నేహితుడు, శ్రేయోభిలాషి అయినటువంటి టి. సుబ్బరామిరెడ్డి తన సొంత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు’ ను ఈ సంవత్సరం నుంచి ఇవ్వనున్నారు. సినీరంగంలో వెలుగు వెలిగిన అన్ని విభాగాలకు సంబందించిన వారిని ప్రతి సంవత్సరం ఈ అవార్డు తో సత్కరించనున్నారు. ఈ అవార్డు తో పాటు వారికి 10లక్షల చెక్ ని కూడా అందించనున్నారు.
ఈ విషయం తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ‘ 60 సంవత్సరాలు నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన యశ్ చోప్రా ఎన్నో మ్యూజికల్, క్లాసికల్, రొమాంటిక్ చిత్రాలను మనకు అందించారు. ఆయన గుర్తుగా ఈ సంవత్సరం నుంచి ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు’ ను ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరం ఈ అవార్డును లేజండ్రీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్ గారికి అందించానున్నాం. ఈ అవార్డు బహుకరణ కార్యక్రమం అక్టోబర్ 19 న ముంబైలో జరగనుంది. ఈ వేడుకకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నారని’ ఆయన తెలిపారు.