మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘తుఫాన్’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు.
ఈ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ ‘ చరణ్ చిరుతతో అదరగొట్టాడు, మొన్న నాయక్ తో దుమ్ము దులిపేసాడు. ఇప్పుడు తుఫాన్ తో ఏసీపీ విజయ్ ఖన్నాగా మీ ముందుకు రానున్నాడు. ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమా సూపర్బ్ గా ఉంటుంది. ఇక అభిమానుల కందరికీ పండగే పండగ. నేను తక్కువ మాట్లాడినా మానస్పూర్తిగా మాట్లాడతాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని’ అన్నాడు.
రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ ముందుగా షూటింగ్ లో ఉంది కూడా ఒక చిన్న మెసేజ్ పెట్టగానే ఇక్కడికి వచ్చిన వెంకీ అన్నయకి నా ధన్యవాదాలు. నేను ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నన్ను చాలా మంది అడిగారు ఇక్కడ మంచి సినిమాలు చేస్తున్నారు కదా మళ్ళీ ఎందుకు బాలీవుడ్ కి వెళ్తున్నారు అని..నా లైఫ్ లో ఎప్పుడు నా అవసరం కోసం ఏ పని చెయ్యలేదు. కథని, డైరెక్టర్ ని నమ్ముకొని అభిమానులు మా వెనుక ఉన్నారనే సినిమా చేస్తాను. అభిమానుల్ని ఎంటర్టైన్ చెయ్యడమే నా ప్రధాన లక్ష్యం. బాలీవుడ్ లో నేనే మొదట కాదండి.. ఒకప్పుడు వెంకీ గారు, నాన్న చిరంజీవి గారు, నాగార్జున గారు బాలీవుడ్ లో సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. ఇదొక మంచి ప్రయత్నం మాత్రమే. మీ అభిమానులను నమ్ముకొనే ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటాం. ఒకవేళ మీకు నచ్చకపోతే చెప్పేయండి. కానీ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు మీ భరోసా మాకు కావాలి. ఇలాంటి సినిమాలు చెయ్యడం వల్ల మన నిర్మాతలకి లాభం రావాలని, మన సినిమాల బడ్జెట్, మార్కెట్ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ సినిమా చేసానని’ అన్నాడు.
ఈ కార్యక్రమానికి వివి వినాయక్, అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు, మహిగిల్, బండ్ల గణేష్ తదితర ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. సెప్టెంబర్ 6న రిలీజ్ కానున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించగా, అపూర్వ లాఖియా డైరెక్టర్.