ప్రస్తుతం ఉన్న తమిళ హీరోలలో మన తెలుగు ప్రేక్షకుల ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళలో కార్తి ఒకడు. ‘మల్లిగాడు’, ‘శకుని’ సినిమాలు తప్ప అతను నటించిన ప్రతీ సినిమానీ మనవాళ్ళు బాగానే ఆదరించారు. నిజానికి తన సినిమాలకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ చాలా తక్కువ కాలంలో తెలుగు మాట్లాడటం నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. కార్తి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను ఇప్పటివరకూ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి ఉండకపోవచ్చు, కానీ నా సినిమాలన్నీ తెలుగులోకి అనువాదం అయ్యాయి. హైదరాబాద్ నాకు రెండో ఇల్లులాంటిది. నా సినిమాలలో కొన్ని సీన్లు ఇక్కడే షూట్ చేసామని” చెప్పాడు.
ఈ ఏడాది అతన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘బిర్యానీ’ మరియు ఎం. రాజేష్ దర్శకత్వంలో ‘ఆల్ ఇన్ ఆల్ అజాగు రాజా’ సినిమాలలో చూడొచ్చు. ‘బిర్యానీ’ సినిమా తెలుగులో డబ్ అవుతుంది. ఇందులో హన్సిక, ప్రేమ్ జీ అమరెన్, మాండీ తాఖర్ తదితర తారలు నటిస్తున్నారు. ఈ సినిమా 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుని మార్చి31నుండి ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం హైదరాబాద్ రానుంది. ఇదిలా ఉండగా ‘ఆల్ ఇన్ ఆల్ అజాగు రాజా’ సినిమాలో కార్తికి జంటగా కాజల్ నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ చాలా భాగం సౌత్ తమిళ్ నాడు మరియు చెన్నైలలో జరుగుతుంది.