లాక్ డౌన్ సడలింపుల వలన ఇప్పుడిప్పుడే అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ షూటింగ్స్ మొదలవుతున్నాయి. దాదాపు ఆరు నెలలు కెమెరాకు దూరంగా ఉన్న హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులు ఎంతో ఉత్సాహంగా చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు. అందరితో పాటే మలయాళ నటుడు టోవినో థామస్ సైతం తన కొత్త చిత్రం ‘కాలా’ షూటింగ్లో పాల్గొంటున్నారు. కాగా ఈరోజు సెట్స్ నందు ప్రమాదం జరిగి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సన్నివేశం చేస్తుండగా కడుపలో బలమైన దెబ్బ తగలడం మూలాన ఆయనకు ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర బృందం ఆయన్ను కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా జరిగిందని గుర్తించిన వైద్యులు ఆయన్ను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మలయాళ సినీ వర్గాల సమాచారం మేరకు ఆయనకు జరిగిన ప్రమాదం పెద్దదేనని, పొత్తి కడుపులోని భాగాలకు గాయం బలంగా అయిందని తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తన అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని అందరూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు.
టోవినో థామస్ మలయాళంలో అనేక పెద్ద చిత్రాల్లో నటించారు. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. అయన నటించిన ‘ఫోరెన్సిక్’ ఆహా ఓటీటీ ద్వారా తెలుగులో కూడ విడుదలైంది. అందులో నటనకుగాను ఆయన తెలుగు ప్రేక్షకుల నుండి కూడ ప్రశంసలు అందుకున్నారు.