1989లో వచ్చిన మైనే ప్యార్ కియా ఓ సంచలనం. సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా భాగ్యశ్రీ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులో ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో విడుదలై సంచలన విజయం నమోదు చేసింది. అలా తెలుగువారికి బాగా పరిచయం ఉన్న భాగ్యశ్రీ చాలా కాలం తరువాత ప్రభాస్ మూవీలో నటిస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై సమాచారం ఉన్నప్పటికీ తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పష్టత ఇచ్చారు.
భాగ్యశ్రీ మాట్లాడుతూ ‘మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికే కొన్ని స్క్రిప్టులు విన్నాను. రెండు సినిమాలకు ఓకే చెప్పాను. అందులో ప్రభాస్ సినిమా ఒకటి ఉంది’ అన్నారు. ఆమె చేయనున్న పాత్ర ఏమిటో తెలియదు కానీ ఆమె నటిస్తున్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. నిజానికి అడివి శేష్, శివాని రాజశేఖర్ జంటగా మొదలై మధ్యలో ఆగిపోయిన 2 స్టేట్స్ సినిమాలో భాగ్యశ్రీ నటించాల్సివుంది.