మణిరత్నం మొట్టమొదటిసారిగా తన చిత్రం “కడలి” చిత్రంలో ప్రధాన తారలు గౌతం మరియు తులసిని మీడియాకి పరిచయం చేశారు. వీరిని చెన్నైలో కాకుండా హైదరాబాద్లో పరిచయం చెయ్యడం ఆసక్తికరం.ఈరోజు నోవోటేల్ లో జరిగిన కార్యక్రమంలో ఏ ఆర్ రెహమాన్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గౌతం,తులసి, లక్ష్మి మంచు, అర్జున్, సుహాసిని మణిరత్నం, మురళి మరియు రాధ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌతం మాట్లాడుతూ “నేను మణిరత్నం చిత్రంతో నటించడం మొదలుపెట్టడం నమ్మసక్యంగా లేదు ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను” అని అన్నారు.నటి రాధ తన కూతురు తులసిని పరిచయం చేస్తూ “తులసి చాలా అల్లరి పిల్ల కానీ ఈ చిత్రంలో నటించడం మొదలు పెట్టినప్పటి నుండి క్రమశిక్షణ అలవరుచుకుంది” అని అన్నారు. తులసి ప్రస్తుతం పదవ తరగతి చదువుతుంది. లక్ష్మి మంచు మాట్లాడుతూ మణిరత్నం చిత్రంలో నటించాలన్న చిరకాల కోరిక నెరవేరింది అని అన్నారు. ఈ చిత్ర ప్రోమో మరియు రెండు పాటలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 1న విడుదల కానుంది.