నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం “గుర్రం పాపిరెడ్డి” ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, నిర్మాతలు వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్న ఈ సినిమాలోని ‘పైసా డుమ్ డుమ్’ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చే విభిన్నమైన కాన్సెప్ట్ అని వెల్లడించింది.
దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ, డార్క్ కామెడీ జానర్‌లో కొత్తగా ప్రయత్నించామని, సినిమా క్వాలిటీ కోసం ప్రతి టీమ్ మెంబర్ కృషి చేశారని తెలిపారు. ఈ సినిమాను డిసెంబర్ 19న, హాలిడేస్ సీజన్‌లో విడుదల చేస్తున్నామని, ఇది మల్టిపుల్ క్యారెక్టర్లు, లేయర్‌లతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. తెలివైనవారు, తెలివితక్కువ వారి మధ్య జరిగే సంఘర్షణ, వారి జీవితాలు ఎలా మారతాయి అనేదే ఈ కథాంశమని వివరించారు. ఈ నెల 11న లేదా 12న ట్రైలర్‌ను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. యోగిబాబు, జాన్ విజయ్ వంటి నటులు ఉండటం వల్ల తమిళంలోనూ విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ, ఈ సినిమాలో అన్ని పాత్రలకూ సమాన ప్రాధాన్యత ఉంటుందని, ‘గుర్రం పాపిరెడ్డి’ తన కెరీర్‌లో కొత్త తరహా పాత్రగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ కథ వినగానే నటించాలని అనిపించిందని, ఈ సినిమా అంతా మంచి ఫన్ ఉండేలా చూసుకున్నామని తెలిపారు. నటులు జీవన్ కుమార్, రాజ్ కుమార్ కాసిరెడ్డి కూడా తమ పాత్రలు విభిన్నంగా ఉంటాయని, సినిమా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.


