విడుదల తేదీ : నవంబర్ 14, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : దుల్కర్ సల్మాన్, పి. సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి తదితరులు.
దర్శకుడు : సెల్వమణి సెల్వరాజ్
నిర్మాత : రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్
సంగీత దర్శకుడు : ఝాను చంథర్, జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రాఫర్ : డాని సాంచెజ్-లోపెజ్
ఎడిటర్ : ఆంటోనీ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
అయ్య(సముద్రఖని) ఓ సినిమా డైరెక్టర్. అనాథ అయిన మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ని తీసుకొచ్చి హీరోని చేస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మహదేవన్ పెద్ద స్టార్ అవుతాడు. దీంతో, తనకు తాను గొప్ప స్టార్ ను అయ్యాను అనే అహంకారం వస్తుంది. దీనికి తోడు కథ కంటే కూడా.. అభిమానులు తనకు కొట్టే చప్పట్లే తనకు ఎక్కువ అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో అయ్య (సముద్రఖని) ఇష్టపడి రాసుకున్న శాంత కథతో సినిమా షూటింగ్ మొదలు అవుతుంది. ఇద్దరి మధ్య కొన్ని ఇగోలు కారణంగా ఆ సినిమా అనుకోకుండా ఆగిపోతుంది. మళ్లీ కొన్నేళ్లకు శాంత సినిమా, కాంత సినిమాగా మళ్ళీ మొదలవుతుంది. ఈ సారి కొత్త అమ్మాయి కుమారి(భాగ్యశ్రీ భోర్సే) హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా కథ ఎలాంటి మలుపులు తిరిగింది?, చివరకు కుమారి కథ ఏమైంది ?, రానా పాత్ర ఏమిటి?, అసలు కాంత సినిమా బయటకు వచ్చిందా? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా కథ 1950 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఓ డైరెక్టర్, ఓ అనాధని తీసుకొచ్చి స్టార్ ని చేశాక, ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన పలు సంఘటనలతో వారిద్దరి మధ్య దూరం పెరిగితే.. వారిద్దరి ఈగో, అహంకారంతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి?, వీరిద్దరి మధ్య హీరోయిన్ ఎలా నలిగింది ?, అలాగే ఈ కథ ముగింపులో వచ్చే ట్విస్ట్ వంటి అంశాలు కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. పోలీసాఫీసర్ గా రానా తన డైలాగ్స్ తో
ఆకట్టుకున్నాడు.
మిగిలిన నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో దుల్కర్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో సాగే కొన్ని విచారణ సన్నివేశాల్లో అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా దుల్కర్ నటన చాలా బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ భోర్సే కూడా తన నటనతో ఆకట్టుకుంది. తన పెర్ఫార్మెన్స్ తో ఆమె మెప్పించింది.
మరో కీలక పాత్రలో నటించిన సముద్రఖని కూడా చాలా బాగా నటించారు. అలాగే రానా మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా 1950 లో నటులు ఎలా ఉండేవాళ్ళు, సినిమాలో సినిమా కోసం యాక్టింగ్ చేస్తున్నట్టు తమ నటనతో అందరూ బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కచ్చితంగా ఓ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కానీ, రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సాగిన ఈ సినిమా మిగిలిన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది డౌటే. చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ప్రధానంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది.
దీనికితోడు ఈ కాంత సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా సాగింది. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది ?, మహదేవన్ పాత్రకు – అయ్య పాత్రకు మధ్య ఏం జరిగింది ?, ఏం జరగబోతుంది? అనే ఉత్కంఠను ప్రేక్షకుల్లో బాగానే కలిగించినా.. అదే పాయింట్ చుట్టూ కథను సాగదీయడంతో సినిమాలో కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లను కూడా ఇంకా బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్, కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ ను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. కానీ, ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు ఝాను చంథర్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలను అభినందించాలి. నిర్మాతలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘కాంత’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కథ, అప్పటి సినీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


