విడుదల తేదీ : అక్టోబర్ 16, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు.ఓ.ఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులు;
దర్శకుడు : విజయేందర్
నిర్మాతలు : కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
సంగీత దర్శకుడు : ఆర్.ఆర్.ధ్రువన్
సినిమాటోగ్రాఫర్ : సిద్ధార్థ్ SJ
ఎడిటర్ :పీకే
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, నిహారిక.ఎన్.ఎమ్ తదితరులు నటించిన సినిమా ‘మిత్రమండలి’. బన్నీ వాస్ సమర్పించారు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
జంగ్లీపట్నానికి చెందిన నారాయణ (వీటీవీ గణేశ్)కు కులం పిచ్చి బాగా ముదిరి, ఆ ఏరియా ఎం.ఎల్. సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు. తన తుట్టె కులానికి చెందినవాళ్లు వేరే కులాల వాళ్ల రక్తాన్ని ఎక్కించుకోవల్సి వచ్చినా వద్దనే రకం. ఇక కులాంతర వివాహాలైతే అస్సలు ఒప్పుకోడు. అలాంటి నారాయణ కూతురు స్వేచ్ఛ (నిహారిక) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించి, తన కూతురు కిడ్నాప్ అయ్యిందంటూ ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) సాయంతో డ్రామా ఆడటం మొదలు పెడతాడు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) ద్వారా స్వేచ్ఛ మిస్సింగ్ వెనుక నలుగురు మిత్రులు చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓ.ఐ), రాజీవ్ (ప్రసాద్) ఉన్నట్టు తేలుతుంది. ఈ నలుగురిలో స్వేచ్ఛ ఎవరికోసం ఇంటి నుంచి బయటికొచ్చింది ?, స్వేచ్ఛ కారణంగా ఈ నలుగురూ ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు ?, వీళ్లని నారాయణ ఏం చేశాడు ?, అసలు ఈ నలుగురి కథ ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
తుట్టె కులానికి చెందిన ట్రాక్ నుంచి, పోలీస్ వెన్నెల కిశోర్ ట్రాక్ తో పాటు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్… వాళ్ల మధ్య అల్లరి, అమాయకత్వం, సరదాల నేపథ్యంలో సాగిన సన్నివేశాలు బాగానే ఉన్నాయి. అలాగే, ఈ డ్రామాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి ఎంటర్టైనింగ్ మోడ్ లో సాగిన ఈ ఫిల్మ్ లో పాత్రలు మరియు వాటి చిత్రీకరణ అలాగే ఆయా పాత్రల గెటప్స్ అండ్ సెటప్ బాగున్నాయి.
ప్రియదర్శి కామెడీ టైమింగ్ బాగుంది. అదేవిధంగా విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా పాత్రలు కూడా బెటర్ గానే సాగాయి. ఇక వీటీవీ గణేష్ పాత్ర కథలో కీలకమే అయినా.. కులపిచ్చి పాత్ర గతంలో వచ్చిన చాలా సినిమాల్లో ఆ తరహా పాత్రల్ని పోలి ఉండటంతో కొత్తగా అనిపించదు. కానీ వీటీవీ గణేష్ నవ్వించాడు. హీరోయిన్ గా నటించిన నిహారిక.ఎన్.ఎమ్ చక్కగా నటించింది. వెన్నెల కిషోర్, సత్యలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ మిత్రమండలి కథా నేపథ్యం, అలాగే నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో మాత్రం దర్శకుడు విజయేందర్ ఇంట్రెస్ట్ కలిగించ లేకపోయారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ చుట్టూ సాగే డ్రామాలో రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దీనికితోడు సెకండ్ హాఫ్ లో పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఇల్లాజికల్ పాయింట్ చుట్టూ ఫేక్ ఎమోషన్స్ తో స్క్రీన్ ప్లే సాగడంతో మిత్రమండలి చిత్రం కొన్ని చోట్ల నిరాశ పరిచింది.
పైగా తుట్టె కులానికి ట్రాక్ అలాగే, పోలీస్ ఆఫీసర్ వెన్నెల కిశోర్ ట్రాక్ లో వచ్చే మెయిన్ సీన్స్ కూడా మెలో డ్రామాలా అనిపిస్తాయి. దీనికి తోడు, పాత్రలు ఎక్కువ అవ్వడం, అలాగే అక్కడక్కడా కామెడీ కోసం పెట్టిన అమవసరమైన డిస్కషన్ కూడా బాగాలేదు. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. మొత్తానికి సినిమాలో పండించాలనుకున్న కామెడీ కూడా రొటీన్ గానే సాగింది. మొత్తమ్మీద దర్శకుడు విజయేందర్ పూర్తి ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని మలచలేకపోయారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు విజయేందర్ టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్ అందించిన సంగీతం పర్వాలేదు. ఐతే సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
తీర్పు :
‘మిత్రమండలి’ అంటూ వచ్చిన ఈ కామెడీ డ్రామాలో.. కొన్ని ఫన్ మూమెంట్స్ అండ్ నటీనటుల పనితీరు, వారి పాత్రల చిత్రీకరణ బాగున్నాయి. కానీ, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ డ్రామా మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్, రెగ్యులర్ అండ్ రిపీటెడ్ సన్నివేశాలు, ముఖ్యంగా ఆసక్తికరంగా సాగని కథనం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ ‘మిత్రమండలి’ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team