‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత యువ హీరో రామ్ చేసిన సినిమా ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 14వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమా మీద బజ్ పెరిగింది. ఇదిలా ఉండగా చాలా రోజుల నుండి రామ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడనే వార్తకు విశేషంగా వినిపిస్తున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వీరి సినిమానే పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. త్రివిక్రమ్ సైతం ‘అల వైకుంఠపురములో’ తర్వాత వేరే కొత్త సినిమా ఏదీ కమిటవ్వలేదు.
దీంతో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. తాజాగా ‘రెడ్’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న రామ్ త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉందని, ఫైనల్ కాలేదని, త్వరలోనే ఏదో ఒకటి తేలుతుందని అన్నారు. మరి ఈ చర్చల్లో వీరి క్రేజీ కాంబినేషన్ సెట్ ఆవుతుందో లేదో చూడాలి. ఇకపోతే రామ్ తరచూ కథలు వింటున్నా కూడ ‘రెడ్’ తర్వాత ఎవరితో వర్క్ చేస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.