రిస్కీ బైక్ స్టంట్స్ సొంతగా చేస్తున్న స్టార్ హీరో

రిస్కీ బైక్ స్టంట్స్ సొంతగా చేస్తున్న స్టార్ హీరో

Published on Nov 12, 2020 1:05 AM IST

తమిళ స్టార్ హీరో అజిత్ చేస్తున్న చిత్రం ‘వాలిమై’. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్ నగరంలో జరుగుతోంది. అన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. బైక్ చేజింగ్ సన్నివేశాల్లో హీరో అజిత్ స్వయంగా పాల్గొంటున్నారు. రిస్కీ స్టంట్స్ అయినప్పటికీ ఎలాంటి డూప్ లేకుండా అజిత్ స్వయంగా చేస్తుండటం విశేషం. ఫ్రంట్ వీల్ గాలిలోకి లేపి సింగిల్ వీల్ మీద డ్రైవ్ చేయడం లాంటి విన్యాసాలను ఆయనే చేస్తున్నారు.

అజిత్ స్వతహాగానే నైపుణ్యం ఉన్న బైక్ రేసర్. అందుకే స్టంట్స్ ఆయనే చేస్తున్నారు. ఇందులో తెలుగు యువ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేస్తుండటం విశేషం. హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అజిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అజిత్, వినోత్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అజిత్ సరసన హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు