ఉత్తరాలతో సూపర్ స్టార్ మనసు మార్చాలనుకుంటున్న అభిమానులు

ఉత్తరాలతో సూపర్ స్టార్ మనసు మార్చాలనుకుంటున్న అభిమానులు

Published on Nov 3, 2020 2:27 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంలేదనే వార్తలు ఆయన అభిమానులను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 15 ఏళ్లుగా రజినీ రాజకీయ రంగప్రవేశం గురించి కలలు కంటున్నారు అభిమానులు. ఎట్టకేలకు ఈమధ్య రాజకేయాల్లోకి దిగుతున్నట్టు రజినీ ప్రకటన చేశారు. త్వరలో రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నిలపనున్నట్లు చెప్పారు. కానీ ఈలోపు కరోనా రావడం, లాక్ డౌన్ విధించబడటంతో రజినీ ఆలోచనలు మారాయి. వైద్యుల సలహా మేరకు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆయన డిసైడ్ అయినట్టు వార్తలొచ్చాయి.

రజినీ సైతం ఆ వార్తలను చూచాయిగా నిజమే అన్నట్టు లెటర్ రిలీజ్ చేశారు. ఆరోగ్యం విషయంలో ఆందోళనగా ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ అభిమానులు మాత్రం సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటున్నారు. బహిరంగ సభలు పెట్టకపోయినా మీడియాను వాడుకుని వర్చువల్ మీటింగ్స్ ద్వారా ప్రచారం నిర్వహించాలని, అలా చేసినా తాము ఆదరిస్తామని అంటున్నారు. అయినా ఆయన నిర్ణయంలో మార్పు వచ్చేలా కనిపించట్లేదు. దీంతో ఫ్యాన్స్ ఆయన్ను ఒప్పించడానికి ఒక మార్గం కనుగొన్నారు. అందరూ కలిసి రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన నివాసానికి భారీ ఎత్తున ఉత్తరాలు రాయాలని అనుకుంటున్నారట. మరి ఈ ఉత్తరాల ప్రయత్నం సూపర్ స్టార్ మనసును ఎంతవరకు మార్చగలుగుతుందో చూడాలి.

తాజా వార్తలు