ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ‘ఆర్ఆర్ఆర్’ను రూపొందిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రాజమౌళి ఇందులోకి ప్రపంచస్థాయి నటీనటుల్ని తీసుకున్నారు. ఎన్టీఆర్ సరసన కథానాయికగా ఒలీవియా మోరిస్ ను తీసుకున్న ఈయన మరొక ప్రధాన పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. అలిసన్ డూడీ హాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు. ఈమె ‘ఆర్ఆర్ఆర్’ నందు లేడీ స్కాట్ పాత్రలో కనిపించనున్నారు.
ఈమె కథలో ప్రధాన విలన్ అనే టాక్ కూడ ఉంది. బ్రిటిష్ సంస్థానంలో ప్రముఖ అధికారిణిగా ఉండే ఈమె కథానాయకులకు సవాల్ విసిరే పాత్రలో కనిపించనుందట. ఇటీవలే సినిమా షూటింగ్ రీస్టార్ట్ కావడంతో అలిసన్ డూడి ఇండియాకు విచ్చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు ఆమె. లేడీ స్కాట్ హెడింగ్ టూ ఇండియా అంటూ చిన్నపాటి వీడియోను పోస్ట్ చేశారు. మరి ఆమె పాత్ర తాలూకు షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందో తెలియాల్సి ఉంది. ఈమెతో పాటు ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ శరన్, సముథిర ఖని, అలియా భట్ లాంటి నటీ నటులు నటించనున్నారు.
ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ పాత్రలోనూ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు.