ఎంటర్టైన్మెంట్ రంగంలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చాయి. ఇప్పటికే అనేక మంది నటులు ఓ టి టి బాట పట్టారు. హాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. టాలీవుడ్ లో జగపతి బాబు, నవదీప్, శ్రీకాంత్ వంటి హీరోలు ఇప్పటికే ఓ టి టి లోకి ఎంటర్ అయ్యారు. కాగా విక్టరీ వెంకటేష్ సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతుంది. తేజ దర్శకత్వంలో ఆయన ఓ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధం అయ్యారట. దీనిపై త్వరలో ప్రకటన కూడా రావచ్చని సమాచారం.
ట్రెండ్ కి తగ్గట్టుగా వెంకటేష్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఈ వార్తను కొట్టిపారేయలేం. ఇదే కనుక జరిగితే ఓ టి టి లోకి ఎంటరైన మొదటి స్టార్ హీరో వెంకటేష్ అవుతారు. వెంకటేష్ ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అసురన్ తెలుగు రీమేక్ నారప్ప లో నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది.