శర్వానంద్, సమంతలు జంటగా నటించిన తమిళ రీమేక్ చిత్రం ‘జాను’ తొలిరోజు మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓవర్సీస్ వసూళ్లలో మాత్రం నెమ్మదిగానే ఉంది. ప్రీమియర్ల ద్వారా 34,168 డాలర్లు మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం శుక్రవారం 34,391 డాలర్లు వసూళ్లు సాధించింది. ఇక రెండవ రోజు శనివారం జాను 52,869 డాలర్ల వసూళ్లు దక్కించుకుంది. మొత్తంగా 1,22,000 డాలర్ల గ్రాస్ వసూళ్లకు చేరుకుంది.1.75 కోట్లకు జాను థియరిటికల్ హక్కులు అమ్ముడైన నేపథ్యంలో జాను అక్కడ ప్లాప్ మూవీగా మిగిలిపోయే అవకాశం కలదు.
సమంత గత చిత్రం ‘ఓ బేబీ’ కేవలం ప్రీమియర్ల ద్వారానే 155,000 డాలర్లను వసూలు చేసింది. దానితో పోల్చితే ‘జాను’ వసూళ్లు చాలా తక్కువనే అనాలి. ఇందుకు కారణం లేకపోలేదు. ‘జాను’ తమిళ ’96’ కు రీమేక్. తమిళంలో డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా డైరెక్షన్ చేశారు. ఒరిజినల్ వెర్షన్లోని ఫ్లెవర్ పోకుండా రీమేక్ చేశారనే ప్రసంశ దక్కింది కానీ ఆ ఒరిజినల్ వెర్షన్ ఆన్ లైన్లో అందుబాటులో ఉండటంతో ఓవర్సీస్ ప్రేక్షకులు థియేటర్లలో చూడటానికి పెద్దగా ఆసక్తి కనబర్చట్లేదు.