విక్టరీ వెంకటేష్ తమిళ చిత్రం ‘అసురన్’ను తెలుగులోకి ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం ఇందులో కథానాయకుడికి ఇద్దరు కొడుకులు ఉంటారు. వారి మీదే కథ నడుస్తుంటుంది. ఈ ఇద్దరు కుమారుల పాత్రల కోసం చాలామందినే ఆడిషన్స్ చేసిన టీమ్ చివరికి ఇద్దర్ని ఎంపిక చేసింది. వారిలో ఒకరు కార్తీక్ రత్నం. కార్తీక్ రత్నం అంటే తెలియకపోవచ్చుకానీ ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంలో జోసెఫ్ అంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు.
ఈ యువ నటుడు నారప్ప పెద్ద కుమారుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక చిన్న కుమారుడి పాత్ర కోసం కొత్త నటుడ్ని తీసుకున్నారు. ప్రస్తుతం అనంతపురంలో షూటింగ్ చేస్తున్న టీమ్ వీలైంత త్వరగా సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.