తెలుగు మరియు తమిళంలో హిట్ అయిన సూపర్ హిట్ సినిమాలను రిమేక్ చేసే పరంపర ప్రస్తుతం బాలీవుడ్లో కొనసాగుతోంది. అదే బాటలో సంజయ్ దత్ కూడా ఓ సినిమా రిమేక్ చేస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ అయిన ‘లక్ష్మీ నరసింహ’ చిత్రాన్ని సంజయ్ దత్ రిమేక్ చేస్తున్నారు. సౌత్ ఇండియన్ సూపర్ హిట్ డైరెక్టర్ కె.ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.పి అగర్వాల్ నిర్మిస్తున్నారు. ‘రాక్ ఆన్’ మరియు ‘బోల్ బచ్చన్’ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రాచి దేశాయ్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
ఈ చిత్ర చిత్రీకరణ నిన్న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ చిత్ర చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్విరామంగా 48 రోజులు జరగనుంది. ఈ షెడ్యూల్లో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ పోలిస్ డిప్యూటీ కమీషనర్ గా కనిపించే సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు సంభందించిన సెట్ ను కూడా ఫిల్మ్ సిటీలో నిర్మించారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఓం పురి, మురళి శర్మ, ముఖేష్ తివారి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.