తెలుగు చలన చిత్ర సీమలో రియల్ ఫీట్స్ చేసి రియల్ స్టార్ గా ఎదిగిన శ్రీ హరి గారి పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో శ్రీ హరి మాట్లాడుతూ ‘ నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎప్పటికైనా ఒక సోలో హీరోగా ఎదగాలనుకున్నాను. నా కలని నిజం చేసుకోవడం కోసం నేను ఎంతో కష్ట పడ్డాను. నా కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, రోజురోజుకి నాలోని నటనని మెరుగుపరుచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాను. నా 25 సంవత్సరాల కెరీర్ నాకు ఎంతో ఆనందాన్నిచ్చిందని’ ఆయన అన్నారు.
ఇప్పటివరకూ శ్రీ హరి చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం తను నటిస్తున్న ‘శిరిడి సాయి’, ‘యమహో యమ’ మరియు ‘జగద్గురు ఆదిశంకర’ అనే సినిమాలు త్వరలోనే ప్రేక్షకులముందుకు రానున్నాయి. ‘యమహో యమ’ సినిమాలో యముడిగా చేయడం చాలా కొత్తగా ఉందని శ్రీ హరి అన్నారు. ప్రస్తుతం శ్రీ హరి నటనకి కొంత కాలం విరామం ఇచ్చి దర్శకత్వం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఒక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ‘ ది గ్యాంగ్’ అనే టైటిల్ ని పెట్టారు. ఒక దావూద్ అనే అనాధ దేవుడు ఎలా అయ్యాడనేదే ఈ చిత్ర కథాంశం అని అన్నారు. శ్రీహరి ఇప్పటి వరకు తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు, అలాగే దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.
ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.