కరోనా దెబ్బకు అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమ కూడ దెబ్బతింది. షూటింగ్లు ఆగిపోయి థియేటర్లు మూతబడ్డాయి. లాక్ డౌన్ ఎత్తివేసినా కూడ థియేటర్లు తెరవడానికి వెనకడుగు వేశారు ఎగ్జిబిటర్లు. ఇక సినిమాలను రిలీజ్ చేయడానికి సాహసించలేకపోయారు నిర్మాతలు. దాదాపు అన్ని భాషల పరిశ్రమల పరిస్థితి ఇదే. కానీ తెలుగు సినిమా మాత్రం ధైర్యం చేసి ముందుకొచ్చింది. షూటింగ్లు మొదలవడంతో అన్ని విభాగాలు మెల్లగా పనిచేయడం మొదలైంది. మిగిలిపోయిన చిత్రీకరణలు పూర్తిచేసుకుని చిన్న, పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇక మిగిలిందల్లా హాళ్లు తెరుచుకోవడమే.
మొదట్లో పలు సందేహాల నడుమ 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవడానికి యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు సంకోచించారు. కానీ చేసి ధైర్యం చేసి ముందుకు దూకారు. మొదట ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రాగా ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఆ తర్వాత రవితేజ ‘క్రాక్’ విడుదలకావడంతో సినీ ప్రేమికులు సినిమా హాళ్లకు పోటెత్తారు. అది చూసి హీరోలు, నిర్మాతలకు ధైర్యం వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 80 నుండి 90 శాతం థియేటర్లు దాదాపు తెరుచుకున్నాయి.
ఇంకో మూడు నెలల వరసగా సినిమాలు విడుదలకానున్నాయి. ఈ నెల 13న ‘మాస్టర్’, 14న ‘రెడ్, అల్లుడు అదుర్స్’, ఫిబ్రవరిలో ‘ఉప్పెన, ఏ1 ఎక్స్ ప్రెస్’,మార్చిలో ‘రంగ్ దే, లవ్ స్టోరీ’. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, నాని ‘టక్ జగదీష్’ డబ్బింగ్ చిత్రం ‘కెజిఎఫ్ 2’, మే నెలలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ జాబితాలో ఇంకా కొన్ని సినిమాలు చేరతాయి. ఇలా ఏ ఇండస్ట్రీలోనూ లేని విధంగా తెలుగులో మాత్రమే భారీ ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నెలాఖరుకు నూరు శాతం థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఇలా టాలీవుడ్ పరిశ్రమ సాహసం చేసి మరీ కరోనా భయాన్ని వేగంగా జయిస్తోంది.