యాక్టింగ్,యాంకరింగ్ మరియు నిర్మాణం వంటి పలు అంశాలలో విజయవంతంగా కొనసాగుతూ తెలుగు ప్రజలకి బాగా పరిచయమయిన లక్ష్మి మంచు, మోహన్ బాబు కూతురుగానే కాదు పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సృష్టించుకున్నారు. “అనగనగా ఓ ధీరుడు ” చిత్రంతో నంది అవార్డు గెలుచుకున్న ఈ నటి టీవీ రంగంలో ప్రేమతో మీ లక్ష్మి, లక్ష్మి టాక్ షో మరియు ప్రస్తుతం వస్తున్న లక్ ఉంటె లక్ష్మి వంటి కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. తాజాగా తెలుగులో తన స్వంత పెర్ఫ్యూమ్ లైన్ ని విడుదల చేస్తున్న మొదటి సెలబ్రిటీ అయ్యారు. అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్ మరియు శిల్ప శెట్టి వంటి వారికి స్వంత పెర్ఫ్యూమ్ లైన్ ఉంది. తెలుగులో లక్ష్మి మంచు పేరు మీద పెర్ఫ్యూమ్ లైన్ ని ఈ నెల 17న ఆవిష్కరించనున్నారు. ఇదిలా ఉండగా ఈ నటి తను నిర్మించి నటించిన “గుండెల్లో గోదారి” చిత్ర విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల కానుంది.