టాలీవుడ్ టాప్ హీరోలు అయిన విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా చేస్తున్న మల్టీ స్టారర్ కుటుంబ కథా చిత్రం ”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉమ్మడి కుటుంబంలో మిస్ అవుతున్న ఆప్యాయతలు, అనుబంధాలను ఈ సినిమాలో చూపిస్తున్నారు. ‘టైటిల్ కి తగ్గట్టు గానే సీతమ్మ వాకిలిని మన అందమైన దేశంగా మరియు సిరిమల్లె చెట్టుని ఒక అందమైన ఉమ్మడి కుటుంబంతో పోల్చుకొని మనసుకు హత్తుకునేలా ఈ సినిమాని డైరెక్టర్ తీర్చిదిద్దుతున్నాడని’ ప్రొడక్షన్ టీం అంటోంది.
శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంత మరియు అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియోని డిసెంబర్ రెండవ వారంలో విడుదల చేసి 2013 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.